చిన్న సినిమాలు సంక్రాంతి మ్యాజిక్ ను రిపీట్ చేస్తాయా.. ఆ సెంటిమెంట్ ప్రూవ్ అవుతుందా?

Reddy P Rajasekhar

సంక్రాంతి అంటేనే తెలుగు సినీ పరిశ్రమకు ఒక పెద్ద పండగ. ఈ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలని అగ్ర హీరోల నుంచి వర్ధమాన నటుల వరకు ప్రతి ఒక్కరూ పోటీ పడుతుంటారు. అయితే గత రెండేళ్ల ట్రెండ్‌ను గమనిస్తే తెలుగు చిత్రసీమలో ఒక కొత్త మార్పు కనిపిస్తోంది. భారీ అంచనాలతో, వందల కోట్ల బడ్జెట్‌తో వచ్చే స్టార్ హీరోల సినిమాలకు గట్టి పోటీనిస్తూ చిన్న సినిమాలు అనూహ్య విజయాలను అందుకుంటున్నాయి.

ముఖ్యంగా 2024 సంక్రాంతి రేసులో మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' వంటి భారీ చిత్రం బరిలో ఉన్నప్పటికీ, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'హనుమాన్' అద్భుతమైన వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద పైచేయి సాధించింది. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిన్న సినిమా సృష్టించిన ప్రభంజనం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదేవిధంగా 2025 సంక్రాంతి బరిలో కూడా 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి చిత్రాలు మ్యాజిక్ చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి రాబోయే సినిమాలపై మళ్లింది.

ఈ నేపథ్యంలోనే రాబోయే కాలంలో కూడా చిన్న సినిమాలు సంక్రాంతి సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తాయా అనే ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియా వేదికగా సాగుతోంది. ప్రస్తుతం 'అనగనగా ఒక రాజు', 'నారీ నారీ నడుమ మురారి', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' వంటి చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. నిర్మాణ విలువలు, కంటెంట్ పరంగా వీటిని చిన్న సినిమాలు అని పిలవలేకపోయినప్పటికీ, ప్రభాస్ 'ది రాజాసాబ్' లేదా మెగాస్టార్ చిరంజీవి గారి  మన శంకర వరప్రసాద్ గారు  వంటి భారీ బడ్జెట్  సినిమాలతో పోల్చి చూస్తే ఇవి పరిమిత బడ్జెట్ చిత్రాలే అని చెప్పాలి.

స్టార్ హీరోల ఇమేజ్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఒకవైపు ఉంటే, వినూత్నమైన కథలు, వినోదం ప్రధానంగా సాగే ఈ చిత్రాలు మరోవైపు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. గతంలో 'హనుమాన్' నిరూపించినట్లుగా, కథలో బలం ఉంటే ప్రేక్షకులు బడ్జెట్‌తో సంబంధం లేకుండా బ్రహ్మరథం పడతారని అర్థమవుతోంది. ఈ ఏడాది కూడా అదే బాక్సాఫీస్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా లేదా ఈ సెంటిమెంట్ మరోసారి నిజమని ప్రూవ్ అవుతుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: