‘ఉప్పెన’ సినిమాతో సంచలన విజయాన్ని సాధించిన దర్శకుడు బుచ్చిబాబు సనా ఇప్పుడు తన రెండో సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈసారి ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘పెద్ధి’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, మ్యూజిక్ గ్లింప్స్ సినిమాపై చాలా పాజిటివ్ బజ్ సృష్టించాయి. బుచ్చిబాబు తన మొదటి సినిమాతోనే చూపించిన భావోద్వేగ గాఢత, గ్రామీణ అథెంటిసిటీ పెద్ద సినిమాలో మరింత స్థాయిలో ఉండబోతుందనే అంచనాలు ఉన్నాయి. ‘పెద్ధి’ను వచ్చే ఏడాది మార్చి 27న, అంటే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే ఆ తేదీకి ముందు రోజు శ్రీరామనవమి రావడంతో, అదే రోజు విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెద్ది షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చరణ్ ఈ సినిమాలో పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇంతలో ఈ భారీ ప్రాజెక్ట్ షూట్ మధ్యలో చిన్న గ్యాప్ వచ్చినట్టు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ ప్రకారం, దర్శకుడు బుచ్చిబాబు సనా తీవ్ర శ్రమతో, రాత్రింబవళ్లు సినిమా పనుల్లో నిమగ్నమై ఉండడంతో స్వల్పంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడంటున్నారు. తిండి, నిద్రకు సమయమివ్వకపోవడంతో బలహీనతకు గురయ్యాడట. ఈ విషయం రామ్ చరణ్‌కి తెలిసిన వెంటనే, ఆయన షూటింగ్‌ను కొన్ని రోజులపాటు ఆపించి బుచ్చిబాబుకు విశ్రాంతి ఇవ్వమని సూచించినట్లు సమాచారం.
ప్రస్తుతం బుచ్చిబాబు కాస్త కోలుకున్నా, ఇంకా పూర్తిగా ఫిట్ అవ్వలేదని చెబుతున్నారు. అయినా ఆయన సినిమాలో తన డెడికేషన్ తగ్గించకుండానే కొనసాగిస్తున్నాడు. రామ్ చరణ్‌కు ఒక బ్లాక్‌బస్టర్ ఇవ్వాలనే తపనతో బుచ్చిబాబు చేస్తున్న కృషిని చూసి టీమ్ సభ్యులు, మెగా అభిమానులు ఆయనను ప్రశంసిస్తున్నారు. పైగా చరణ్ చివరి సినిమా గేమ్ ఛేంజర్ డిజాస్టర్ కావడంతో పెద్ద సినిమా తో ఎలాగైనా చరణ్‌కు హిట్ ఇవ్వాలని మరింత కసితో వర్క్ చేస్తున్నాడట. మొత్తం మీద, ‘పెద్ధి’ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లోనే కాకుండా బుచ్చిబాబు కెరీర్‌లో కూడా మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.