ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న మిరాయ్.. రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమా?
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో యువ కథానాయకుడు తేజ సజ్జా, విలక్షణ నటుడు మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన విజువల్ వండర్ మిరాయ్ గత నెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అత్యద్భుతమైన నిర్మాణ విలువలు, కట్టిపడేసే కథాంశంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, విభిన్నమైన కథాంశాలను ఎంచుకోవడంలో తేజ సజ్జా మరోసారి తన మంచి అభిరుచిని నిరూపించుకున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక, థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం గురించి ఓటీటీ అప్‌డేట్ తాజాగా అభిమానులను నిరాశకు గురిచేసింది. సాధారణంగా భారీ హిట్ చిత్రాలు ఓటీటీలోకి రావడానికి కొంత సమయం తీసుకుంటాయి. కానీ, మిరాయ్ మాత్రం కేవలం కొద్దివారాల వ్యవధిలోనే స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ఇంకా ఆడుతున్నప్పుడే ఇంత తక్కువ సమయంలో ఓటీటీలోకి రావడం పట్ల ఫ్యాన్స్ కాస్త ఫీలింగ్‌కు లోనవుతున్నారు.
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన మిరాయ్, ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో, ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి. ఏదేమైనా, సినిమా ఇంత త్వరగా ఓటీటీలోకి వస్తుండడం మాత్రం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన మిరాయ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించిన వసూళ్లతో చరిత్ర సృష్టించింది. కేవలం ₹60 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ యాక్షన్ ఫాంటసీ అడ్వెంచర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘన విజయం తేజ సజ్జా కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది.
ఎలాంటి టికెట్ హైక్ లేకుండా, ఈ చిత్రం మొదటి రోజునే ప్రపంచవ్యాప్తంగా ₹27 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, యంగ్ హీరోల సినిమాల స్థాయిలో కొత్త రికార్డులను నెలకొల్పింది.