మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. `బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది.జగదేక వీరుడు అతిలోక సుందరి` తరహాలో సోషియో ఫాంటసీగా తెరకెక్కుతుంది. ఇందులో మైథలాజికల్ టచ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది.ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ ఈ సమ్మర్‌లో రాబోతుంది. అయితే వీఎఫ్‌ఎక్స్ డిలే అవుతున్నాయని, ప్రస్తుతం చేస్తున్న కంపెనీ వీఎఫ్‌ఎక్స్ సంతృప్తికరంగా లేకపోవడంతో కొత్త కంపెనీకి వర్క్ ఇచ్చారని తెలుస్తుంది.ఇదిలావుండగా టాలీవుడ్ లో ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల్లో రాజమౌళి తర్వాత చెప్పుకోవాల్సిన పేరు అనిల్ రావిపూడి. కళ్యాణ్ రామ్ పటాస్‌తో మొదలుపెట్టి బాలకృష్ణ భగవంత్ కేసరి దాకా ట్రాక్ రికార్డుని ఒకేలా మెయింటైన్ చేస్తున్నారు.
ఈ పండుగకు సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ తో మూడోసారి వెంకటేష్ తో ఈ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ మరోసారి ఎఫ్2, ఎఫ్3 మించిన ఫన్ ఇస్తానని నమ్మకంగా చెబుతున్నాడు. దానికి తగ్గట్లే పోటీ సినిమాల కన్నా వేగంగా తన సినిమా పాటలు ఛార్ట్ బస్టర్స్ అయిపోయి 90 మిలియన్ల వ్యూస్ దాటేసింది. త్వరలో వంద మైలురాయి వైపు పరుగులు పెడుతున్నాయి. ఇదిలా ఉండగా రావిపూడి తర్వాత సినిమా సాహు గారపాటి నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కథ ఓకే కాగా స్క్రిప్ట్ కు సంబంధించిన డెవలప్ మెంట్లు గురించి తాజాగా చిరు ఇంట్లోనే చర్చలు జరిగాయి.ఈ నేపథ్యంలో చిరుని ఎలా చూపిస్తాడనే దాని పై ఫ్యాన్స్ ఊహాగానాలు రకరకాలుగా ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
వింటేజ్ చిరంజీవిని చూపించడం కాదు.. కానీ ఆయనను తాను ఎలా చూడాలని కోరుకుంటున్నానో అలాగే ప్రెజెంట్ చేస్తానంటూ చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ ఓదెల ఒకలా చూపిస్తే నేను చిరంజీవిని ఇంకోలా చూపిస్తానని, ఫైనల్ గా ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా కథలు రాసుకుంటానంటూ చెప్పేశాడు. మహేష్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్లతో పని చేసిన రావిపూడి ఇప్పుడీ మెగా ఆఫర్ ని ప్రమోషన్ గా భావిస్తున్నాడు. కాకపోతే స్క్రిప్ట్ లాకయ్యాక చిరు క్యారెక్టరైజేషన్ గురించి చెబుతానని అంటున్నారు. కాబట్టి ఇంకొన్ని వారాలు వేచి చూడక తప్పదు. విశ్వంభర చివరి దశలో ఉండడంతో బాలన్స్ పూర్తి చేయడంలో మెగాస్టార్ బిజీగా ఉన్నారు. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ వేసవిలో థియేటర్లకు తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.