హీరో అవ్వడం కాదు.. నా చిన్నప్పటి కల అదే : శివ కార్తికేయన్
తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళలో శివకార్తికేయన్ ఒకరు. రజినీకాంత్, విజయ్, అజిత్ లాంటి స్టార్ హీరోల తర్వాత తన సినిమాలతో అత్యధిక కలెక్షన్లను సాధిస్తున్నారు. తమిళ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ పొందే హీరోలలో శివకార్తికేయన్ కూడా ఒకరు. చాలా తక్కువ సమయంలోనే ఇంతటి ఎత్తుకు ఎదిగినందుకు ఆయన్ని అందరూ అభినందిస్తున్నారు.
శివకార్తికేయన్ తండ్రి ఒక పోలీస్ ఆఫీసర్. కాలేజీ చదువుతున్నప్పుడే ఆయన తండ్రిని కోల్పోయారు. కాలేజీ చదువు తర్వాత కొంతకాలం మిమిక్రీలు చేస్తూ గడిపారు. ఆ తర్వాత విజయ్ టీవీలో యాంకర్ గా చేసారు. విజయ్ టీవీలో కొంతకాలం పని చేసిన శివకార్తికేయన్ కు సినిమాల్లో నటించాలనే కోరిక ఎప్పుడో వచ్చింది. అనేక సినిమా కంపెనీలు, దర్శకులను కలిసి అవకాశం కోసం ప్రయత్నించారు. చివరకు దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో ‘మెరినా’ అనే సినిమాలో నటించే అవకాశం దొరికింది.
తరువాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ, ‘వరుతపడత వాలిబార్ సంగం’నే అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన ‘రజినీ మురుగన్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో శివకార్తికేయన్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. తర్వాత స్వయంగా సినిమా నిర్మించాలనే ఆలోచనతో ముందుకు వెళ్లారు. కానీ కోట్ల రూపాయల అప్పుల్లో చిక్కుకున్నాడు. ఇప్పుడు ఆ అప్పు నుంచి కోలుకున్నాడు. తాను నటించిన ‘అమరన్’ అనే సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు.
ఈ సినిమాను రాజ్‌కమల్ ఫిలిమ్స్ నిర్మించింది. దీపావళికి విడుదల చేయనున్నారు. అమరన్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న శివ కార్తికేయన్ తన జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చిన్నప్పుడు తన కల ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడమే అని చెప్పారు. కానీ తండ్రి మరణం తర్వాత తల్లి ఆయన కలను వదులుకోమని కోరింది. ఇంజినీరింగ్ చదివిన తర్వాత IPS ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలని ఆలోచించినా, తల్లి మాట విని ఆ ఆలోచనను వదిలేసానని అని తెలిపారు.