తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన కాంబినేషన్లో మెగాస్టార్ చిరంజీవి , దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు కాంబినేషన్ ఒకటి. వీరిద్దరి కాంబినేషన్లో చాలా సినిమాలు రాగా అందులో కొన్ని భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. కొన్ని ఇండస్ట్రీ హిట్లను కూడా అందుకున్నాయి. ఇంత క్రేజ్ కలిగిన ఈ కాంబోలో మూవీ ఆల్మోస్ట్ సెట్ అయ్యాక క్యాన్సిల్ అయింది. ఆ సినిమా ఏది ..? ఎందుకు క్యాన్సల్ అయింది అనే వివరాలను తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం మోహన్ బాబు హీరోగా శోభన హీరోయిన్గా రాఘవేందర్రావు దర్శకత్వంలో అల్లుడు గారు అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.
ఇకపోతే రాఘవేంద్రరావు ఈ సినిమాను మొదట మోహన్ బాబు తో కాకుండా చిరంజీవి తో చేయాలి అనుకున్నాడట. చిరంజీవితో ఒక సందర్భంలో నీతో ఓ సినిమా చేయబోతున్నాను ... కథను కూడా రెడీ చేస్తున్నాను అని చెప్పాడట. ఆయన కూడా ఓకే అన్నాడట. ఆ తర్వాత ఆ సినిమాకు సంబంధించిన కొంత భాగం కథను చిరంజీవికి వినిపించగా కథ సూపర్ గా ఉంది చేద్దాం అని కూడా చిరంజీవి అన్నాడట. ఇక కథ పూర్తి అయిన తర్వాత ఒక రోజు రాఘవేంద్రరావు , చిరంజీవికి ఫోన్ చేసి నీకు చెప్పిన కథ మొత్తం పూర్తి అయింది.
కానీ అది నీపై వర్కౌట్ కాదు అన్నాడట. ఎందుకు సార్ అని అడగ్గా ... ఆ సినిమా క్లైమాక్స్ లో హీరో చనిపోయే సన్నివేశం ఉంది. నీ క్రేజ్ కి హీరో చనిపోతాడు అంటే జనాలు ఒప్పుకోరు. ఆ సినిమా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే ఆ కథలో నువ్వు హీరోగా వద్దు అన్నాడట. దానితో చిరంజీవి ఓకే అన్నాడట. ఆ తర్వాత రాఘవేంద్రరావు , మోహన్ బాబు కు ఆ కథను చెప్పాడట. ఆయన ఒప్పుకోవడంతో అల్లుడు గారు అనే టైటిల్ తో ఆ సినిమాను రూపొందించాడట. ఇక అల్లుడు గారు సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.