హిందీ బాక్సాఫీస్‌ పై దండెత్తుతున్న తెలుగు హీరోలు!

praveen

అవును, ఇపుడు బాలీవుడ్ ఖాన్స్ మన తెలుగు హీరోల దాటికి బలవుతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఏ ముహూర్తాన బాహుబలి అనే సినిమా ఇక్కడినుండి వెళ్ళిందో ఇక అక్కడి నుండి అక్కడి హీరోలకే కాదండోయ్, దర్శక నిర్మాతలకు కూడా కంటిమీద కునుకు ఉండడం లేదట. ఇక బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు. హిందీ బాక్సాఫీస్‌లో ప్రభాస్ సినిమాలు భారీ వసూళ్లు సాధించడంతో, అక్కడ అతడికి మంచి మార్కెట్ ప్రస్తుతం ఏర్పడింది. అంతే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులకు సైతం ప్రభాస్ ఫేవరెట్ హీరో అయిపోయాడు.
ఇక ఇపుడు అదే కోవకు చెందుతాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ‘పుష్ప’ సినిమాతో అక్కడ అల్లు అర్జున్ భారీ క్రేజ్ దక్కించుకున్నాడు. పుష్ప పార్ట్ 1 చిత్రం హిందీ బాక్సాఫీస్‌పై సెన్సేషన్‌ క్రియేట్ చేయడంతో అల్లు అర్జున్ కి తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్లో కూడా అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పుడు అదే దారిలో ఎన్టీఆర్ వెలుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంతో బాలీవుడ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి మార్కులే కొట్టేశారు. రామ్ చరణ్ తో కలిసి ఆయన ఈ సినిమా ద్వారా హిందీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఇక ఇప్పుడు ‘దేవర’ సినిమాతో ఎన్టీఆర్ ఈ మార్కెట్‌ని తిరిగి రిపీట్ చేసినట్టు కనబడుతోంది.
హిందీలో మొదటి వీకెండ్‌కి 25 కోట్లకి పైగా నెట్ వసూళ్లు సాధించి, ఇపుడు 50 కోట్ల దిశగా అడుగులు వేస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరో స్టార్ మహేష్ బాబు కూడా తన తదుపరి చిత్రంతో హిందీ మార్కెట్‌లోకి దూసుకుపోతున్నాడు. ఆ మధ్య హీరో నిఖిల్ కూడా కార్తికేయ 2 సినిమాతో బాలీవుడ్లో చిచ్చు లేపిన సంగతి విదితమే. మరోవైపు, ‘పుష్ప 2’ కూడా ఈ ఏడాది విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా కూడా హిందీ మార్కెట్‌ పై దూసుకుపోయే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఇలా తెలుగు హీరోలు హిందీ బాక్సాఫీస్‌ను సైతం తమ ఆధీనంలోకి తీసుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో విజయవంతం అవుతున్నారని బాలీవుడ్ వర్గాలు గుర్రుగా ఉన్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: