టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న కొరటాల శివ కెరియర్ ప్రారంభంలో చాలా సంవత్సరాల పాటు ఎన్నో సినిమాలకు కథ రచయితగా పని చేశాడు. ఈయన కథ రచయితగా పని చేసిన చాలా సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. ఇకపోతే ఈయన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన మిర్చి మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో కొరటాల కి అదిరిపోయే రేంజ్ గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది.
మరి కొరటాల శివ కు మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చిందో తెలుసా ..? ఈ విషయాల గురించి దిల్ రాజు ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. అసలు విషయం లోకి వెళితే ... దిల్ రాజు కి ఓ ఇంటర్వ్యూలో మీరు చాలా మంది దర్శకులను పరిచయం చేశారు. మీరు నిర్మించిన సినిమాలకు కొరటాల గారు పని చేశారు. మరి ఆయనను ఎందుకు దర్శకుడిగా మీరు ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు అనే ప్రశ్న ఎదురయింది. దీనికి దిల్ రాజు సమాధానం ఇస్తూ ... అసలు కొరటాల శివ ను కూడా నేనే ఇండస్ట్రీకి పరిచయం చేయాల్సింది. ఆయన రాసుకున్న ఎన్నో సినిమా కథలను నాకు వినిపించాడు. నేను ఇండస్ట్రీకి ఆయనను పరిచయం చేద్దాం అనుకున్నాను.
కానీ అదే సమయంలో యు వి క్రియేషన్స్ బ్యానర్ వారితో కొరటాలకు పరిచయం ఏర్పడింది. వారు కూడా ఓ బ్యానర్ పెట్టి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇద్దాం అనుకున్నారు. ఇక వారితో కొంత కాలం ట్రావెల్ అయ్యాడు. ఆ సమయంలో కొరటాల వారికి ఒక పాయింట్ చెప్పడం , అది నచ్చడంతో వారే ఆ సినిమాను చేయాలి అనుకోవడంతో కొరటాల యువి క్రియేషన్ బ్యానర్ ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.