భారతీయ సినిమా పరిశ్రమలో కనిపించే దిగ్గజ నటులలో కమల్ హాసన్ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలలో ఎన్నో విలక్షణ పాత్రలను ఆయన పోషించారు. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో ఆయన ఎన్నో సినిమాలలో నటించారు. 70 ఏళ్ల వయసులో ఉన్న ఆయన ప్రస్తుతం కొత్త విషయాలను నేర్చుకోవడంలో తపన పడుతున్నారు. ఈ వయసులోనూ ఆయన ప్రస్తుతం అమెరికాకు వెళ్లారు. అక్కడ కొన్ని నెలల పాటు ఉండనున్నారు. అందివస్తున్న కొత్త టెక్నాలజీలో పట్టు సాధించేందుకు కొన్ని కోర్సులను ఆయన అక్కడ అభ్యసించనున్నారు. దీని కోసం కమల్ హాసన్ అమెరికాలోని ఓ ప్రముఖ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి 90 రోజుల కోర్సును ఆయన నేర్చుకునేందుకు వెళ్లారు. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
ప్రభాస్ హీరోగా నటించి 'కల్కి 2898 ఏడీ' చిత్రాన్ని చూసినట్లయితే, ఈ చిత్రం క్లైమాక్స్‌లో కనిపించే కమల్ హాసన్ రూపాన్ని చూడొచ్చు. తర్వాతి పార్ట్‌లో కమల్ నటనా విశ్వరూపాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరపై చూపించనున్నారు. ఇక దశావతారం సినిమాలో కమల్ హాసన్ ఒక్కడే 10 పాత్రలను పోషించారు. దీంతో సినీ ప్రేక్షకులే కాక దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోయారు. ఎవరికీ సాధ్యం కాని ఎన్నో పాత్రలను ఆయన అవలీలగా చేస్తారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా సినీ రంగంలో కమల్ హాసన్ పేరొందారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం కనిపిస్తోంది. రానున్న కాలంలో దీని వినియోగం అన్ని రంగాల్లో పెరగనుంది.
దీంతో సినీ రంగంలో ఏఐ కీలక పాత్ర పోషించనుందని కమల్ గ్రహించారు. ఇప్పటికే 'లాల్ సలామ్' సినిమాతో సౌత్ సినిమాల్లో సంగీతంలో ఏఐని ఉపయోగించడం మొదలైంది. ఈ చిత్రంలో మరణించిన ఇద్దరు గాయకుల స్వరాలతో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కొత్త పాటలను స్వరపరిచారు. సినిమా నిర్మాణంలో ఏఐ వినియోగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో ఏఐలో 90 రోజుల క్రాష్ కోర్సు నేర్చుకునేందుకు కమల్ హాసన్ అమెరికా వెళ్లారు. తన సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో 45 రోజుల్లోనే ఈ కోర్సు పూర్తి చేసి స్వదేశానికి వెళ్లాలని కమల్ హాసన్ భావిస్తున్నారట. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 3, మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ సినిమాలను చేస్తున్నారు.