'మనం' సినిమా విషయంలో ఇప్పటికీ బాధపడుతున్న నాగార్జున?

Suma Kallamadi
అక్కినేని సీనియర్ హీరోల నుండి జూనియర్ హీరోలవరకు అందరూ కలిసి నటించిన చిత్రం 'మనం.' ఈ సినిమా ఆనాడు ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మే 23, 2014న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు గురువారం ఈ సినిమాని పలు థియేటర్లలో రీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నాగార్జున తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని పంచుకోవడం జరిగింది. ఇందులో నాటి జ్ఞాపకాలను అయన నెమరు వేసుకున్నారు.
సదరు పోస్టులో ఆయన... "మనం అనే సినిమా మా కుటుంబానికి చాలా ప్రత్యేకం. ఎందుకంటే అది నాన్నగారికి ఆఖరి చిత్రం. అందుకే ఎలాగైనా ఈ మూవీ ఒక క్లాసిక్ గా నిలవాలని ఆయన తరచూ నాతో చెప్పేవారు. అంతే కసిగా మొత్తం మనం టీమ్ వర్క్ చేయడం జరిగింది. కట్ చేస్తే అనుకున్నదే జరిగింది. అవును, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ఈ సినిమాని ఒక శిల్పిలాగా తీర్చిదిద్దాడు. అదేవిధంగా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అయితే పాటలకు ప్రాణం పోశాడు. ఇలా ఈ చిత్రానికి పని చేసిన వారందరికీ ఈరోజున పేరుపేరునా స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నా. ఇక ఆ సమయంలో నాన్న కాస్త ఇబ్బంది పడుతూనే సెట్సుకు వచ్చేవారు. మా అందరినీ నవ్వించేవారు. ఇక ఆ సినిమా విషయంలో నాకు ఇప్పటికీ ఒకటే బాధ ఉండిపోయింది. అది... ఆయనకు ఆ సినిమాని పెద్ద స్క్రీన్ పైన చూపించలేకపోయాననే బాధ." అని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా దర్శకుడు విక్రమ్ కుమార్ కూడా ఆ సినిమా జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ... "నాగేశ్వరరావు గారికి స్క్రిప్టు వినిపించే సమయంలో.. నా చేయి తగిలి టేబుల్ పైన ఉన్న గ్లాసు కింద పడి పగిలి పోయింది. ఆ శబ్దానికి అక్కడ పనిచేసే కొందరు బాయ్స్ ఏం జరిగిందో? అనుకుంటూ కంగారుగా రావడంతో అది గమనించిన సార్ డోర్ దగ్గర ఉన్నవారిని లోపలికి రావొద్దని చెప్పారు. కథలో అంతగా ఆయన అపుడు లీనమైపోయారు. నేను స్టోరీ చెప్పడం పూర్తయ్యాక మాత్రమే వాళ్లను రమ్మని రూమ్ క్లీన్ చేయించారు. ఆ క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను!" అంటూ ఆయన తన జ్ఞాపకాలను చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: