సలార్ మూవీ గతంలో ప్రశాంత నీల్ తెలకెక్కించిన 'ఉగ్రం' సినిమాకి రీమేక్ అని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయమై ఇటీవల సలార్ నిర్మాత విజయ్ కిరగందుర్ అందులో వాస్తవం లేదని చెప్పారు. కానీ తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాత్రం అది నిజమే అని ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. సలార్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ నీల్ 'సలార్ కథ ఉగ్రం సినిమాని బేస్ చేసుకుని రాసింది' అని చెప్పుకొచ్చారు." ఉగ్రం సినిమాను భారీ ఎత్తున ఆడియన్స్ నడుమ థియేటర్స్ లో చూడాలని అనుకున్నాను.
కానీ 2014 టైంలో సినిమా రిలీజ్ అయినప్పుడు నేను అనుకున్నంత హిట్ అవ్వలేదు. సినిమాని చాలా పెద్ద రేంజ్ లో ఊహించాను. ఉగ్రం కథకి చాలా పెద్ద స్కోప్ ఉంది. 'కేజిఎఫ్' రేంజ్ కథ అది. అందులో చెప్పలేకపోయిన పాయింట్స్ ను 'సలార్' రూపంలో తీశాను. అందుకే సలార్ సినిమా కథ ఉగ్రం మూవీని పోలి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే సలార్ మూవీని ఉగ్రం స్టోరీ బేస్ తో కేజిఎఫ్ స్టైల్ లో తీశాను" అంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్ నీల్. అలా అని ఆ రెండు సినిమాలకు మధ్య ఎటువంటి సంబంధం ఉండదని స్పష్టం చేశాడు. అంతేకాకుండా కేజీఎఫ్ కథ 80ల కాలంలో సాగుతుందని,
సలార్ కథ ప్రస్తుత కాలంలో ఉంటుందని వెల్లడించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ సుమారు రూ.250కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో పృద్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రీయా రెడ్డి, టీనూ ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి భువన గౌడ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.50 కోట్ల మార్క్ అందుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల ఓపెనింగ్స్ ని అందుకోవడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.