పెద్ద బాధ్యతని తలపైకి ఎత్తుకున్న చిన్న హీరో... వర్కవుట్ అవుతుందా?
అవును, అతను మరెవరో కాదు. కొబ్బరి మట్ట, హృదయ కాలేయం లాంటి స్పూఫ్ కామెడీ సినిమాలతో మంచి హిట్లు కొట్టిన సంపూర్ణేష్ బాబు. అవును, అంతవరకు ఒక ముసధోరణిలో పోతున్న సినిమాలకు అదిరిపోయే షాక్ ఇచ్చాడు సంపు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తెలుగు కమర్శియల్ సినిమాలపైనే సెటైర్ వేశాడు. దాంతో ఒక్కసారిగా సంపు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. తరువాత ఎందుకనో సంపు కెరీర్ అనుకున్నంత వేగంగా సాగలేదు. పదే పదే ఆ టైపు కథలే చేయడం జనానికి బోర్ కొట్టేసి తర్వాత జనాలు పట్టించుకోవడమే మానేశారు. పోనీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుదామంటే సరైన అవకాశాలు వచ్చిన దాఖలాలు లేవు.
ఇదే క్రమంలో సంపు హీరోగా ఓ ఫుల్ లెంగ్త్ సినిమా వస్తోంది. వచ్చే వారం అక్టోబర్ 27 “మార్టిన్ లూథర్ కింగ్” సినిమాతో థియేటర్లలో అడుగు పెడుతున్నాడు. ఇరవై రోజుల ముందే తెలుగు రాష్ట్రాల్లో పలు నగరాల్లో సాధారణ ప్రేక్షకులకు ఈ సినిమా ప్రీమియర్లు వేయడం కొసమెరుపు. అయితే ఇంత ఖర్చు పెట్టి కష్టపడి తిరుగుతున్నా ఈ మార్టిన్ లూథర్ కింగ్ మీద పబ్లిక్ దృష్టి అంతగా పోవడం లేదు. అందరూ దసరా చిత్రాల మత్తులో ఉన్నారు. వేటికవే భారీ సినిమాలు కావడంతో అన్నీ చూసేయాలన్న మూవీ లవర్స్ ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నారు. ఇక ఈ దసరాని పురస్కరించుకొని భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వరరావు మూడు సినిమాలు వస్తుండడంతో జనాలు వాటిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు.
సరిగా ఇలాంటి టైంలో సంపూర్ణేష్ కోసం మళ్ళీ టికెట్లు కొని థియేటర్లకు రావడం అంత సులభంగా ఉండదు మరి. సెప్టెంబర్ చివర్లో పెదకాపు 1, చంద్రముఖి 2 లాంటి క్యాస్టింగ్ ఉన్న వాటినే జనాలు పట్టించుకోకపోతే సంపూర్ణేష్ సినిమాకి కనీసం ఓపెనింగ్స్ వస్తాయా అని గుసగుసలు వినబడుతున్నాయి. నవంబర్ మొదటి వారం వచ్చి ఉంటే కాస్తే బెటర్ గా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమయంలో సంపు చాలా పెద్ద భారాన్ని నెత్తిన పెట్టుకున్నాడు అని అంటున్నారు.