
అన్ స్టాపబుల్ సీజన్ 3.. మొదటి ఎపిసోడ్ వచ్చేది అప్పుడే..!
నటసింహ నందమూరి బాలకృష్ణ మాస్ హీరోగా ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే . ప్రస్తుతం మల్టీ టాలెంటెడ్ హీరో అనిపించుకుంటున్న ఈయన తాజాగా భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 వ తేదీన విడుదల కాబోతోంది. ఇదిలా ఉండగా మరొకవైపు బుల్లితెరపై ఆహా తెలుగు ఓటిటి వేదిక గా అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు మూడవ సీజన్ ని కూడా మొదలు పెట్టేసింది.
అందులో భాగం గానే సీజన్ 3 గురించి చెప్పినప్పటి నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. ఇక అభిమానుల ఎదురుచూపులకు తెర దించుతూ.. మొదటి ఎపిసోడ్ ను త్వరలోనే తీసుకువచ్చే ప్రయత్నం చేయబోతున్నారు నిర్వాహకులు. అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె పేరుతో సరికొత్త రికార్డు లను సృష్టించడమే కాదు బాలయ్య లోని ఇంకో కోణాన్ని చూపిస్తూ ఎంతోమంది స్టార్స్ ని తీసుకొచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించారు. ఇప్పటికే చాలా మంది హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు, రాజకీయ నాయకులు కూడా వచ్చి సందడి చేసారు.
ఇకపోతే అన్ స్టాపబుల్ సీజన్ 3 దసరా ముందే మొదటి ఎపిసోడ్ ఉండనున్నట్టు.. మొదటి ఎపిసోడ్లో భాగంగా భగవంత్ కేసరి టీం.. కాజల్, శ్రీ లీల , అర్జున్ రాంపాల్, అనిల్ రావిపూడి పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయిందని.. షూటింగ్లో పాల్గొన్న భగవంత్ కేసరి టీం ఫోటోలను ఆహా రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాదు అక్టోబర్ 17వ తేదీన మొదటి ఎపిసోడ్ రిలీజ్ కానుంది అని ఆహా స్పష్టం చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.