త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేయడంలో ఆలస్యం జరుగుతుంది కానీ .. వన్స్ స్టార్టయ్యిందా ఇక బ్రేకులుండవు అంటారు అందరూ.పక్కా ప్లానింగ్‌లో మొదలుపెట్టి, అంతే వేగంగా పూర్తి చేస్తూ ఉంటారు.
అయితే రెండేళ్లుగా ఆయన నుండి సినిమాలు అయితే లేవు. 2020 సంక్రాంతికి వచ్చిన 'అల వైకుంఠపురములో'నే చివరి సినిమా. అయితే 'భీమ్లా నాయక్'కి స్క్రీన్‌ప్లే, మాటలు కూడా అందించారు. దీంతో గురూజీ అభిమానులు సినిమా కోసం తెగ ఎదురు చూస్తున్నారు.మధ్యలో ఆ సినిమా, ఈ సినిమా అనుకున్నా ఆఖరికి మహేష్ బాబు సినిమా ఓకే అయ్యి, కొబ్బరికాయ కూడా కొట్టేశారట.
త్వరలో మహేష్‌బాబు సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తుంది. 'సర్కారు వారి పాట' ఆఖరి దశకొచ్చేస్తోందని, తరువాత త్రివిక్రమ్ సినిమానే అంటున్నారు. అయితే ఇన్నాళ్ల గ్యాప్‌ను మరపించాలని త్రివిక్రమ్ గట్టిగా అనుకుంటున్నారని సమాచారం. మహేష్ బాబు సినిమా తర్వాత రెండు సినిమాలను కూడా ప్రకటించే పనిలో ఉన్నారని తెలుస్తుంది. అది కూడా అగ్రహీరోలతోనే తీస్తున్నారని సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే గురూజీ అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అయితే ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్‌ల సినిమాలే త్రివిక్రమ్ లైనప్‌లో ఉన్న నెక్స్ట్ మూవీస్ అంటున్నారు.
ఇప్పటికే బన్నీతో 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో..'తో హ్యాట్రిక్ కొట్టిన త్రివిక్రమ్ సెకండ్ హ్యాట్రిక్ బీజం వేయాలని చూస్తున్నారని తెలుస్తుంది. మరోవైపు 'అరవిందసమేత'తో కొత్త లుక్ లో ఎన్టీఆర్‌ను పరిచయం చేశారు గురూజీ. రెండో సినిమా వస్తే బాగుండు అని అందరూ కూడా అనుకుంటున్నారు. అలా 'అయిననూ పోయిరావలె హస్తినకు' అనే సినిమా కూడా ఓకే అయ్యింది. అయితే ప్రకటన అయ్యాక నిలిచిపోయింది. దీంతో ఎన్టీఆర్‌తో ఓ సినిమా ఉంటుంది అని అందరూ అంటున్నారు.
మరి ఈ ఇద్దరిలో త్రివిక్రమ్ తరువాత చిత్రం ఎవరితో ఉంటుంది అనేది చూడాలి. ఎన్టీఆర్‌కి అయితే కొరటాల శివ, అనిల్ రావిపూడి, బుచ్చిబాబు లైనప్‌లో ఉన్నారని సమాచారం.ప్రశాంత్ నీల్ సినిమా కూడా లైన్‌లో నే ఉంది. ఇక బన్నీకి అయితే 'పుష్ప 2' తర్వాత కొరటాల శివ సినిమా చేయాలట.. ఆ తర్వాత ఏంటి అనేది ఇంకా అయితే తెలియదు. సో త్రివిక్రమ్.. మహేష్ సినిమా తర్వాత ఎవరితో చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.