సుజిత్ వైపు చూస్తున్న పవన్ కళ్యాణ్ !
ప్రభాస్ తో ‘సాహో’ చేసే అవకాశం సుజిత్ కు వచ్చినప్పుడు ఇండస్ట్రీలోని వారంతా సుజిత్ అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఉండరు అంటూ అతడిని ఆకాశంలోకి ఎత్తేసారు. అయితే జరిగింది వేరు. ఆమూవీ భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో కనీసం సుజిత్ కు కథలు చెప్పే అవకాశం కూడ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితితో సుజిత్ పని అయిపోయింది అని అనుకున్నారు అంతా.
అయితే అందరి ఊహలు తలక్రిందలు చేస్తూ సుజిత్ కు మరో బంపర్ ఆఫర్ వచ్చింది అంటూ ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమధ్య సుజిత్ ఒక ప్రముఖ నిర్మాతతో కలిసి పవన్ కళ్యాణ్ ను కలవడం అతడికి ఒక కథ చెప్పడం జరిగిందట. ఆకథ పవన్ కు కూడ బాగా నచ్చడంతో తాను ఆమూవీలో నటిస్తానని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఆశ్చర్యపరిచే విషయం మరొకటి ఇందులో ఉంది. సుజిత్ పవన్ కు చెప్పిన కథ ఒక తమిళ సినిమా కథ అంటున్నారు. తెలుస్తున్న సమాచారంమేరకు తమిళ టాప్ హీరో విజయ్ నటించిన ‘తేరీ’ మూవీకి కొద్దిగా మార్పులుచేర్పులు చేసి ఈకథను పవన్ కు వినిపించాడు అని అంటున్నారు. వాస్తవానికి విజయ్ నటించిన ఈమూవీ తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో డబ్ అయి ఫెయిల్ అయింది. దీనితో ఈవిషయాలు తెలియకుండా పవన్ ఈమూవీలో నటించడానికి ఒప్పుకున్నాడా అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు.
పవన్ కళ్యాణ్ పూర్తి చేయవలసిన సినిమాల లిస్టు రోజురోజుకి పెరిగిపోతోంది. ఎప్పుడో ప్రారంభం అయిన క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ ఇంకా పూర్తికాలేదు ఈలోపున సముద్రఖని తో సినిమాను ఒప్పుకున్నాడు. హరీష్ శంకర్ తో చేయవలసిన ‘భవదీయుడు భగత్ సింగ్’ ఎప్పుడు పూర్తీ చేస్తాడో తెలియదు. ఇన్ని సినిమాల మధ్య పవన్ సుజిత్ ల మూవీ పరిస్థితి ఏమిటి అంటూ కొందరి కామెంట్స్. ఈమధ్యలో పవన్ తన రాజకీయ ఊహాల వేగం పెరగడంతో పవన్ తో తీయబోతున్న సినిమాలు మరింత ఆలస్యం అవుతున్నాయి..