రామ్ చరణ్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా...

NAGARJUNA NAKKA
మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌కి మాస్‌ హీరో ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్‌కి తగ్గట్టుగానే మాసీయాక్షన్‌ మూవీస్‌లో నటిస్తుంటాడు. 'రంగస్థలం'లో చెవిటి చిట్టి బాబు పాత్ర పోషించిన చరణ్‌ ఆ వెంటనే మాస్ ఇమేజ్‌కి తగ్గట్లుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'వినయవిధేయరామ' సినిమా చేశాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తాపడింది. ఇక ఈ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ ఒకదానితో మరొకటి సంబంధం లేని జానర్స్‌లో సినిమాలు చేస్తున్నాడు.

రామ్ చరణ్‌ కెరీర్‌ బిగినింగ్‌లోనే బాలీవుడ్‌ మార్కెట్‌ని ఫోకస్ చేశాడు. 2013లో 'జంజీర్'తో హిందీ ఇండస్ట్రీకి వెళ్లాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర ఘోరంగా బోల్తా పడింది. దీంతో చరణ్ మళ్లీ ముంబాయి వైపు చూడలేదు. అయితే ఇప్పుడు 'ఆర్ ఆర్ ఆర్'తో చెర్రీ మళ్లీ బాలీవుడ్‌కి వెళ్తున్నాడు. రాజమౌళి బ్రాండ్‌తో ఈ సినిమా భారీగా వసూల్ చేస్తుందని, నార్త్‌లో మార్కెట్‌ వస్తుందని నమ్మకంగా ఉన్నాడు.

రామ్ చరణ్‌ 'ఆర్ ఆర్ ఆర్' తర్వాత అన్నీ పాన్‌ ఇండియన్‌ ప్రాజెక్టులే చేస్తున్నాడు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌తో పొలిటికల్‌ థ్రిల్లర్‌ మొదలుపెట్టాడు. ఈమూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. ఆ తర్వాత గౌతమ్‌ తిన్ననూరితో ఒక ప్రాజెక్ట్‌ చేయబోతున్నాడు. 'జెర్సీ'తో హిందీకి వెళ్లిన గౌతమ్‌, నెక్ట్స్ చరణ్‌తో పాన్‌ ఇండియన్‌ మూవీ ప్లాన్‌ చేస్తున్నాడు.

రామ్ చరణ్‌ నెక్ట్స్‌ డైరెక్టర్‌ కమ్ యాక్టర్ సముద్రఖనితో ఒక సినిమా చేస్తాడనే టాక్ వస్తోంది. వైవిధ్యమైన కథలతో సినిమాలు తీసే సముద్రఖని చరణ్‌తో లార్జ్‌ స్కేల్ మూవీ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇక చెర్రీ లిస్ట్‌లో ఉన్న మూడు సినిమాలు మూడు డిఫరెంట్‌ జానర్స్‌లో రాబోతున్నాయని చెప్పొచ్చు. శంకర్‌ సినిమాల్లో గ్రాండ్‌నెస్‌ ఉంటే, గౌతమ్‌ తిన్ననూరి సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉంటాయి. ఇక సముద్రఖని సినిమాలు రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. సో చరణ్‌ సినిమా సినిమాకి కొత్తగా కనిపించే అవకాశముందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: