పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే వరుస సినిమాలతో బిజీ గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల తన రీ ఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్.. తాజాగా మరో నాలుగు సినిమాలకు ఓకే చెప్పాడు. అందులో ఒకటైన "హరిహర వీరమల్లు" అతి త్వరలోనే మళ్లీ పట్టాలెక్కబోతోంది.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు.పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాపై పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ లో ఈ సినిమా ఎంత గ్రాండ్గా ఉంటుందనేది అర్థమైపోయింది. అంతేకాకుండా ఈ సినిమాలో భారతదేశానికి చెందిన పురాతన సెట్టింగ్స్ కూడా వేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అలాంటి సెట్లలో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించిన మేకర్స్.. ఇప్పుడు ఇంకో భారీ సెట్టింగ్ వేయడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారట. అదికూడా 17వ శతాబ్దం నాటి చాందిని చౌక్ సెట్టింగ్ అని సమాచారం.అంతేకాదు రాబోయే రోజుల్లో ఈ సెట్ లోనే షూటింగ్ జరగబోతోందట. ఇక ఈ సెట్ ను కూడా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి దగ్గరుండి చేయిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సెట్ కోసం భారీగానే ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా ఓ షెడ్యూల్ షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే కొత్త సెట్ లో మరో భారీ షెడ్యూల్ ని దర్శకుడు క్రిష్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక బందిపోటు పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. ఇక పవన్ సరసన నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇక వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది...!!