తెలుగు చిత్ర పరిశ్రమకు మూల స్తంభాలుగా దశాబ్దాలపాటు వెలిగిన వెండితెర వేలుపులు నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు. హీరోలుగా నటించినంత కాలం వీరిద్దరూ వారికి వారే పోటీ, వారికి వారే సాటి అనేస్థాయిలో సిల్వర్ స్క్రీన్‌ను ఏలేశారు. ఈ ఇద్దరూ పోషించినన్ని విభిన్నమైన పాత్రలు ఆ తరువాత వచ్చిన కథానాయకులు చేయలేకపోయారనే చెప్పాలి. పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రక, భక్తిరస ప్రధాన చిత్రాలన్నింటిలోనూ నటించి మెప్పించిన ఘనత ఇద్దరికీ ఉంది. అయితే పౌరాణిక చిత్రాల ద్వారా ఎన్టీఆర్ మరింత ఖ్యాతి దక్కించుకుంటే, సాంఘికం.. ప్రధానంగా ప్రేమకథా చిత్రాల్లో ఏఎన్నార్ తనకు ఎదురులేదనిపించుకున్నారు. పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్‌లా నటించగల స్థాయి దేశంలోనే మరెవరికీ లేదని అందరూ ఒప్పుకున్నదే. ఇక దేవదాసు చిత్రంలో ఏఎన్నార్ స్థాయిలో తాను నటించలేకపోయానని బాలీవుడ్ మేటి నటుడు దిలీప్‌కుమార్ స్వయంగా చెప్పుకున్నారు. అది ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల స్థాయి. ఇక వీరిద్దరి మధ్య వృత్తిపరమైన పోటీ ఉన్నా అంతకుమించిన స్నేహ బంధమూ ఉంది.
ఇక ఎన్టీఆర్, ఏఎన్నార్ లలో ఎవరు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేవారన్న అంశం ఆసక్తికరమే కదూ..! అందరూ తారకరాముడిదే పారితోషికం విషయంలో పైచేయి అనుకుంటారు గానీ అది నిజంకాదు. మొదట్లో చాలాకాలం పాటు ఏఎన్నార్‌దే అత్యధిక రెమ్యూనరేషన్. దీనికి కారణం ఎన్టీఆర్ సినీ రంగంలో అడుగుపెట్టే నాటికే ఏఎన్నార్ సక్సెన్‌ఫుల్ హీరోగా పేరు తెచ్చుకోవడమే. 1941లోనే సి. పుల్లయ్య దర్శక నిర్మాతగా తెరకెక్కిన ధర్మపత్నిచిత్రంతో ఏఎన్నార్ వెండితెరకు పరిచయమైనా అందులో ఆయనది హీరో పాత్ర కాదు. అప్పటికి ఆయన వయసు 17 ఏళ్లే. ఆతరువాత 1944లో సీతారామజననం కథానాయకుడిగా ఏఎన్నార్‌కు తొలిచిత్రంగా చెప్పాలి. అందులో ఆయన రాముడి పాత్ర పోషించారు. ఆతరువాత బాలరాజు, కీలుగుర్రం వంటి హిట్ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తొలిసారిగా వెండితెరపై కనిపించింది 1949లో ఎల్వీ ప్రసాద్ తెరకెక్కించిన మనదేశం చిత్రంలో. ఆ తరువాత 1951తో వచ్చిన పాతాళభైరవి చిత్రంతో ఆయన విజయాల యాత్ర మొదలైంది. సో ఆవిధంగా ఎన్టీఆర్ కంటే ఏఎన్నార్ సీనియర్ హీరో అన్నమాట. ఈ కారణంగానే రెమ్యూనరేషన్ ఎన్టీఆర్ కంటే ఏఎన్నార్ దే ఎక్కువ ఉండేదట. చాలకాలంపాటు ఇదే కొనసాగింది. అయితే సంఖ్యాపరంగా ఎన్టీఆర్ చేసిన సినిమాలు ఎక్కువ. ఇక సొంతంగా సినిమాలు నిర్మించడం, దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించడం, ధీరోదాత్తమైన పాత్రల పోషణ ద్వారా ఎన్టీఆర్ ఇమేజ్ మరింత పెరిగింది. దాంతో ఇద్దరి రెమ్యూనరేషన్ సమానం కాగా, ఎన్టీఆర్ సినీరంగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చేముందు చేసిన నాదేశం చిత్రానికి రోజుకు రూ. లక్ష చొప్పున 25 రోజులకు పాతిక లక్షలు రెమ్యూనరేషన్ అందుకున్నారట. ఇది ఆనాటికి దేశంలోనే అత్యధికం. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అప్పట్లో ఒక సినిమాకు తీసుకున్నది రూ. 10 లక్షలే.