స్టార్ కిడ్స్ కు కరణ్ జోహార్ అభయం..!

NAGARJUNA NAKKA
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ని హీరోయిన్‌గా లాంచ్‌ చెయ్యాలని అలా అనుకుందో లేదో కరణ్ జోహర్ చెక్‌తో ఇంటికెళ్లిపోయాడు. బోనీ కపూర్‌కి సొంత బ్యానర్ ఉన్నా డైరెక్టర్లు చేతిలో ఉన్నా జాన్వీని ధర్మా ప్రొడక్షన్స్‌లోకి తీసుకొచ్చాడు. షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్‌ హీరోగా, శ్రీదేవి కూతురు జాన్వీ హీరోయిన్‌గా 'ధడక్' సినిమా తీశాడు. అయితే ఈమూవీ రిలీజ్‌ కాకముందే శ్రీదేవి అనుమానాస్పదంగా చనిపోయింది.
మహేశ్‌ భట్‌ బాలీవుడ్‌లో ఎంతో మందిని స్టార్స్‌గా మలిచాడు. దర్శకనిర్మాతగా బోల్డన్ని సినిమాలు తీశాడు. అయితే ఈ మేకర్‌ కూతురు ఆలియా భట్‌ని కూడా కరణ్ జోహారే లాంచ్ చేశాడు. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో డేవిడ్ ధావన్ కొడుకు వరుణ్ ధావన్‌, మహేశ్‌ భట్‌ కూతురు ఆలియా భట్‌ని హీరోహీరోయిన్లుగా ఇంట్రడ్యూస్ చేశాడు. అలాగే ఈమూవీతోనే సిద్దార్థ్‌ మల్హోత్రా కూడా బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు.
ఒకప్పుడు కరణ్‌ జోహార్‌ స్కూల్‌ అంటే స్క్రీన్‌ నిండా స్టార్లు.. సినిమా నిండా ఎమోషన్లు.. అనే కామెంట్లు వినిపించేవి. అలాగే ఇప్పుడు కరణ్‌ స్టూడెంట్స్ ఆఫ్‌ ది ఇయర్‌ అనగానే వారసులు ఎంట్రీ ఇస్తున్నారు. 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్2'తో చంకీ పాండే కూతురు అనన్యా పాండే హీరోయిన్‌గా లాంచ్ అయ్యింది. ఇక ఈ మూవీతో తారా సుతారియాని కూడా హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేశాడు కరణ్‌ జోహార్.
కరణ్‌ జోహార్‌ కొత్త కథల కోసం ఎంత ఆసక్తిగా వెతుకుతుంటాడో, స్టార్‌ కిడ్స్‌ని లాంచ్‌ చెయ్యడానికి అంతే ఆసక్తి చూపిస్తుంటాడు. స్టార్ కిడ్స్‌ ట్వంటీస్‌లో అడుగుపెట్టడం ఆలస్యం వాళ్లని ధర్మ ప్రొడక్షన్స్‌కి తీసుకొస్తుంటాడు. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్‌ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్‌ని ఇలాగే సినిమాల్లోకి తీసుకొస్తున్నాడు. ఈ జూ.సైఫ్‌ని కరణ్‌ హీరోగా లాంచ్ చేస్తాడనే టాక్ వస్తోంది. అందుకే 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని' సినిమాకి ఇబ్రహీంని అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పెట్టుకున్నాడట కరణ్‌ జోహార్.
కరణ్‌ జోహార్, షారుఖ్‌ ఖాన్‌ ఫ్రెండ్‌ షిప్‌ని కొలవడానికి కొలబద్దలు లేవని చెప్తుంటారు. అలాంటి ఫ్రెండ్‌ పిల్లలు ట్వంటీస్‌లో ఉన్నారంటే కరణ్‌ ఊరుకుంటాడా.. షారుఖ్ పెద్దకొడుకు ఆర్యన్ ఖాన్, కూతురు సుహానా ఖాన్‌ ఇద్దరూ ధర్మ ప్రొడక్షన్స్‌లోనే లాంచ్‌ అవుతారనే ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: