పునీత్ ఫ్యామిలీని వణికిస్తోన్న హార్ట్ స్ట్రోక్..!
పునీత్ రాజ్ కుమార్ హృదయంలోని రక్తనాళాలు చిట్లిపోవడం వల్లే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. జిమ్ సమయంలో కార్డియాక్ అరెస్ట్ జరిగి ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. పునీత్ కు వర్కవుట్లు, వ్యాయామం అంటే చాలా ఇష్టమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పునీత్ వర్కవుట్లు చాలా ప్రమాదకరంగా ఉండేవని పేర్కొన్నారు.
హఠాన్మరణం చెందిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పార్థీవ దేహాన్ని కంఠీరవ స్టేడియంలో ఉంచారు. దీంతో తమ అభిమాన హీరోను కడసారి చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివస్తున్నారు. ఆయన మృతదేహాన్ని చూసి కంటతడి పెడుతున్నారు. పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పిస్తున్నారు. పునీత్ అంత్యక్రియలు నేడు అధికారిక లాంఛనాలతో పూర్తి కానున్నాయి.
మరోవైపు కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని తట్టుకోలేక ఓ అభిమాని గుండె ఆగింది. కర్ణాటకలోని పొన్నచ్చి తాలూకా సమీపంలోని మారూరుకు చెందిన 30ఏళ్ల మునియప్ప.. పునీత్ చనిపోయాడని తెలుసుకొని కుప్పకూలిపోయాడు. గుండెపోటుకు గురైన అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. చిన్నప్పటి నుంచి మునియప్ప పునీత్ ను అభిమానిస్తుండగా.. అతడికి ఏడాది వయసు కూతురుంది. మొత్తానికి పునీత్ రాజ్ కుమార్ మరణం ఆయన అభిమానులను కోలుకోలేని దెబ్బతీసింది. వేలాది మంది కంఠీరవ స్టేడియంలోనే ఉండి ఆయనను చూసుకుంటూ కన్నీరు పెడుతున్నారు.