ప్రభాస్ హీరోగా వి.వి వినాయక్ దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా మదర్ సెంటిమెంట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది యోగి చిత్రం. 2007 సంవత్సరంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా సినిమాకు రమణ గోగుల సంగీతం సమకూర్చగా కన్నడలో సూపర్ హిట్ అయిన జోగి సినిమాకు ఇది రీమేక్. భారీ యాక్షన్ చిత్రం గా తెరకెక్కిన ఈ సినిమా లో సుబ్బరాజు, ప్రదీప్ రావత్, శారద, కోట శ్రీనివాసరావు ముఖ్య పాత్రల్లో నటించగా ఈ సినిమా ఎన్నో అంచనాలతో థియేటర్లలో విడుదల అయ్యింది.
పల్లెటూరులో అల్లరిచిల్లరిగా తిరుగుతూ అమ్మే లోకంగా ఆమెను అమితంగా ప్రేమిస్తూ ఓ కుర్రాడు పట్టణానికి వచ్చి అక్కడి పరిస్థితులలో అనుకోకుండా రౌడీ గా మారతాడు. వెంటనే వస్తానన్న తన కొడుకు ఇంకా రాలేదని వెతుక్కుంటూ పట్నం వస్తుంది హీరో తల్లి. అయితే తల్లి పట్నం వచ్చిందని తెలిసి ఆమెకోసం హీరో కూడా వెతుకుతాడు. చివరికి ఆ తల్లి తన కొడుకును చేరువ అవుతుందా.. హీరో రౌడీ గా చూసి ఆమె ఏ నిర్ణయం తీసుకుంది అనేదే ఈ సినిమా కథ.
ఈ సినిమా తొలి సీన్ విలన్ ను చంపడం తో మొదలవుతుంది. అక్కడ ప్రభాస్ హీరోయిజాన్ని భారీగా చూపించిన దర్శకుడు ఆ తర్వాత ఆ హీరోయిజాన్ని కంటిన్యూ చేయలేకపోయాడు. వాస్తవానికి తర్వాత కథలో అలాంటి ఛాన్స్ కూడా ఎక్కడా రాలేదు. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ సాధించలేకపోయింది. ఈ సినిమా కంటే ముందు లక్ష్మి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వివి వినాయక్ నయనతారను వరుసగా రెండవసారి హీరోయిన్ గా కంటిన్యూ చేయగా చత్రపతి పౌర్ణమి వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత ఈ సినిమాను చేశాడు. ఆ సినిమాలతో మంచి ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఆ రేంజ్ లో తన క్యారెక్టర్ ను బిల్డ్ చేసుకోకపోవడంతో ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అలా ప్రభాస్ ఎంతగానో నమ్మి చేసిన యోగి చిత్రం ప్రేక్షకులను ఈమాత్రం మెప్పించలేక పోగా ఆయన కెరీర్లోనే డిజాస్టర్ గా మారింది.