సామాన్యుడి ప్రశ్న: థియేటర్ కు ఎందుకెళ్ళాలి ?

VAMSI
నడుస్తున్న సంగతులు చూస్తే చిత్రంగా ఉంది. రోజు రోజుకీ సామాన్యుల బ్రతుకులు చిద్రమైపోతున్నాయి. పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్నారు. నిత్యావసర సరుకులతో పాటు ఎంటర్ టైన్మెంట్ అందించే సినిమా టికెట్ల ధరలు సైతం భారీగా పెంచేస్తున్నారు. అదేంటన్నా ? ఏదో మనసులో గుస్సా అయితాందని సినిమా చూడనికి వెళితే... ఆ రేట్లు ఏంటి అంటున్నా... సమజయితలేదా? మనకు ఉన్న ఎంటర్టైన్మెంట్ సాధనాలలో సినిమా కూడా ఒకటి. అలాంటి సినిమాను ఈ రోజు సామాన్య మానవుడు చూడలేని పరిస్థితి. ఒకప్పుడు చాలా హాయిగా కుటుంబమంతా ఒక 500 రూపాయలు చేతిలో ఉంటే సినిమా చూసుకుని వచ్చే వాళ్ళు...కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక్క టికెట్ ధర ఎంతనో తెలుసా ? 500 పలుకుతోంది. మరి ఇంక సామాన్య మానవుడికి సినిమా చూసే చాన్స్ ఎక్కడిది. ఆ 500 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్ళడం కన్నా ఏదైనా ఇంటిలోకి అవసరమైన వస్తువులు తీసుకోవచ్చులే అని సరిపెట్టుకుంటున్నారు. మరి సామాన్యుడి సంతోషాన్ని హరించిన తప్పు ఎవరిదో ? ఒకసారి చూద్దాం.

ఒకప్పుడు అయితే సినిమా అంటే ఒక సంవత్సరం లోపే షూటింగ్ అయిపోయి రిలీజ్ చేసేవారు. ఆ సినిమాలకు ఖర్చు పెట్టే బడ్జెట్ కూడా తక్కువగానే ఉండేది. కాబట్టి సినిమా థియేటర్లో రిలీజ్ అయిన 20 రోజులలో సినిమా బాగుంటే పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేది. ఇంకొద్ది రోజులు ఆడితే లాభాలు వచ్చేవి. ఇది కొంతకాలం వరకు తెలుగు సినిమా పరిస్థితి. సినిమా టికెట్ ధర కూడా అందరికీ అందుబాటులో ఉండేది. కానీ గడుస్తున్న కొద్దీ  హీరోలు మారారు, నిర్మాతలు, డైరెక్టర్ అంతా మారారు. సినిమాను చూసే విధానం కూడా మారిపోయింది. ఇప్పుడు సినిమా అనేది బిజినెస్ గా మారింది. దానితో ఒక్కో స్టార్ హీరో సినిమా సంవత్సరాల పాటు తీస్తున్నారు. బడ్జెట్ కూడా వందల కోట్లు అవుతోంది. భారీ తారాగణం, ఇద్దరు హీరోలు మరియు హీరోయిన్లు, నలుగురు లేదా అయిదుగురు విలన్లు, ఐటెం సాంగ్... ఇలా ఎన్నో అంశాలు జోడించి బడ్జెట్ ను అమాంతం పెంచేస్తున్నారు. ఇక పెట్టిన బడ్జెట్ తిరిగి రావడమే కాకుండా లాభాలు కూడా రావాలి కాబట్టి... నిర్మాతల స్వార్థం కోసం థియేటర్లో సినిమా టికెట్ ధరను భారీగా పెంచేస్తున్నారు. అంతే కాకుండా థియేటర్లో కూల్ డ్రింక్ లేదా స్నాక్స్ కొనాలన్నా ధరలు మామూలుగా ఉండవు.

ఇటువంటి పరిస్థితుల్లో సినిమా  చూడడానికి ఒక సామాన్యుడిగా థియేటర్ కు ఎందుకు వెళ్ళాలి. హ్యాపీగా ఇంట్లో కూర్చుని ఓ టీ టీ లో వచ్చే సినిమాలు చూస్తాము అని ఆలోచిస్తున్నారు. థియేటర్లో ఒక్క సినిమా చూడడానికి 500 రూపాయలు ఖర్చు చేయడం కన్నా... 299 రూపాయలు రీఛార్జ్ చేసుకుని ఓటిటిలో నెల మొత్తం మనకు నచ్చిన అన్ని భాషల సినిమాలు చూడడం ఎంతో మేలు అని సామాన్య ప్రేక్షకుడు అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది మన అందరికీ తెలుసు. కాబట్టి ఏదైనా సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేయండి. ధనవంతుడు ఎలాగైనా చేసి ఎంత ధర అయినా టికెట్ కొని సినిమా చూడగలడు.  కానీ పేద మధ్యతరగతి ప్రజలు అలా కాదు. ప్రతి ఒక ఖర్చుకు లెక్కలు వేసుకుంటూ కూర్చుంటారు. సినిమా చూడాలి అనే పేదవాడి ఆశను బ్రతికించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: