తెలుగు సినిమా రంగంలో ఎంతో మంది హీరోయిన్లు ఓ వెలుగు వెలిగారు. వీరిలో తెలుగు గడ్డపై పుట్టిన హీరోయిన్లు కూడా సౌత్ టు నార్త్ వరకు అన్ని భాషల్లోనూ స్టార్ హీరోలతో వరుసగా హిట్ సినిమాల్లో నటించారు. మహానటి సావిత్రి నుంచి జయసుధ - జయప్రద - విజయనిర్మల లాంటి నాటి తరం హీరోయిన్లతో పాటు నేటి తరంలో అంజలి లాంటి వాళ్లు కూడా తెలుగు గడ్డపై పుట్టిన వారే. సీనియర్ నటి సుమలత కూడా అచ్చ తెలుగు అమ్మాయి. గుంటూరు జిల్లాలోని రేపల్లె లో పుట్టిన సుమలత సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. 1980వ దశకంలో వెండితెరపై మెరిసిన సుమలత మెగాస్టార్ చిరంజీవి పక్కన కూడా నటించింది.
ఆ తర్వాత తమిళ - కన్నడ - మలయాళ సినిమాల్లో కూడా నటించి ప్రశంసలు అందుకుంది. సుమలత సౌతిండియాలో అన్ని భాషల్లో హీరోయిన్‌గా నటిస్తూ స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేశారు. ఆ టైంలో కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ తో ఆమె ప్రేమలో పడింది. అప్పట్లో అంబరీష్ - కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మంచి స్నేహితులుగా ఉండేవారు. మోహన్ బాబు సైతం అంబరీష్ - సుమలత ప్రేమకు ఎంతో సహకరించారు. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం సుమలత కర్ణాటక లో సెటిల్ అయిపోయింది.
అంబరీష్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం తో పాటు మంత్రిగా కూడా పనిచేశారు. అంబరీష్ మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చిన సుమలత గత ఎన్నికల్లో మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభ ఎంపీగా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో సుమలత యంగ్ హీరో నిఖిల్ గౌడ పై విజయం సాధించి సంచలనం క్రియేట్ చేశారు. అలా తెలుగింటి ఆడపడుచు ఆయన సుమలత కన్నడనాట కోడలిగా అడుగు పెట్టి... అక్కడ నుంచి సగర్వంగా లోక్‌సభలో అడుగు పెట్టారు.