టాలీవుడ్ లో ప్రేమకథా చిత్రాల్లో నటించి లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్. బొమ్మరిల్లు , నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సినిమాలతో ఈ యంగ్ హీరో తెలుగు అమ్మాయిల మదిని దోచేశాడు. కానీ కొన్ని ఏళ్లుగా సరైన హిట్ లేకపోవడంతో సిద్ధార్థ్ టాలీవుడ్ కు దూరం అయ్యాడు. ఇక సిద్ధార్థ్ ప్రస్తుతం సినిమాల కంటే సోషల్ మీడియా లోనే ఎక్కువ యాక్టివ్ గా ఉన్నట్టు కనిపిస్తోంది. సామాజిక రాజకీయ అంశాల పై తనదైన రీతిలో స్పందిస్తూ సిద్ధార్థ్ వార్తల్లో నిలుస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం నీట్ పరీక్ష విధానంపై సిద్ధార్థ్ స్పందించాడు. కేంద్రం పై విమర్శలు కురిపించాడు.
అంతేకాకుండా కరోనా విజృంభణ సమయంలో బిజెపి సర్కారు పనితీరు పై దుమ్మెత్తి పోశాడు. దాంతో తమిళనాడు బీజేపీ సిద్ధార్థ్ కు వార్నింగ్ కూడా ఇచ్చింది. సిద్ధార్థ్ సినిమాలు చేసుకోవాలని... రాజకీయాల్లో వేలు పెట్టొద్దని సలహా ఇచ్చింది. ఇక ఇది ఇలా ఉండగా తాజాగా ఒక షాకింగ్ పోస్ట్ సిద్ధార్థ్ కంటపడింది. యవ్వన వయస్సులో చనిపోయిన నటీనటులు అంటూ ఓ యూట్యూబ్ ఛానల్ సౌందర్య, ఆర్తి అగర్వాల్ ఫోటోలతో పాటు సిద్ధార్థ్ ఫోటోను కూడా వాడుకుంది. ఇక ఈ వీడియో కి సంబంధించిన ఒక మీమ్ నెట్టింట వైరల్ అవుతోంది. అందులో పైన సిద్ధార్థ్ చనిపోయాడని ఉండగా.... కింద నేను చనిపోయాను నాకు తెలియకుండానే సినిమాలు చేస్తున్నాను అంటూ సిద్ధార్థ్ ఫోటో ఉంది.
అయితే ఈ పోస్ట్ కాస్తా ఇప్పుడు సిద్ధార్థ్ కంట పడటంతో హీరో స్పందించాడు. అంతేకాకుండా తాను ఈ వీడియోపై యూట్యూబ్ ఛానల్ కు రిపోర్ట్ చేశానని చెప్పారు. తను ఎన్నో ఏళ్ళ క్రితం మరణించాలని ఎలా రాస్తారని ప్రశ్నించినట్లు తెలిపాడు. దానికి యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు క్షమించాలి అయినా ఈ వీడియోతో ఏం ప్రాబ్లం ఉంది అంటూ సమాధానం ఇచ్చారని అని అన్నాడు. తాను చనిపోయినట్టుగా చెప్పడమే కాకుండా అడిగితే యూట్యూబ్ నిర్వాహకుడు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంపై సిద్ధార్థ్ షాక్ అయ్యారు.