ఆచార్య విషయంలో చిరంజీవిలో మారిన ఆలోచనలు !
చిరంజీవి కొరటాల శివ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘ఆచార్య’ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు అడ్డు రాకుండా ఉండి ఉంటే ఈమూవీ ఇప్పటికే విడుదల అయి రికార్డులను క్రియేట్ చేసేది. సెకండ్ వేవ్ వల్ల ఈమూవీ షూటింగ్ చివరి దశకు వచ్చి ఆగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి రావడంతో మూవీ షూటింగ్ లు అన్నీ ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి ‘ఆచార్య’ కూడ చేరిపోయింది. చిరంజీవితో పాటు చరణ్ సోనూ సూద్ లాంటి కీలక నటీనటులపై దర్శకుడు కొరటాల పెండింగ్ సీన్స్ షూటింగ్ ను షూట్ చేయడం మొదలు పెట్టాడు.
తెలుస్తున్న సమాచారం మేరకు మరో పది రోజుల్లో ఈమూవీ షూటింగ్ పూర్తిగా ఫినిష్ అవుతుంది అని అంటున్నారు. వాస్తవానికి కొరటాల ఈమూవీని దసరా రేసులో తీసుకు రావాలని భావించాడు. అయితే అంతవరకు ఆగవద్దని ఈ మూవీని సెప్టెంబర్ లో రాబోతున్న వినాయక చవితికి విడుదల అయ్యేలా ప్లాన్ చేయమని చిరంజీవి కొరటాలకు స్పష్టంగా చెప్పినట్లు టాక్.
ఇలా చిరంజీవి ఆలోచనలలో మార్పు రావడానికి ఒక కారణం ఉంది అని అంటున్నారు. ఈసారి దసరా కు ‘ఆర్ ఆర్ ఆర్’ ను తీసుకు రావాలని చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమూవీ అనుకున్న విధంగా వచ్చినా రాకపోయినా ‘కేజీ ఎఫ్ 2’ ‘రాథే శ్యామ్’ దసరా కు విడుదల అవ్వడం ఖాయం అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ అనవసరపు పోటీలో చిక్కుకుపోకుండా ముందుగానే ‘ఆచార్య’ కు లైన్ క్లియర్ చేయాలి అన్నది చిరంజీవి వ్యూహం అని అంటున్నారు.
అయితే వ్యూహం వెనుక మరో ఆసక్తికర కారణం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ ప్రాంతంలో దేశంలో మళ్ళీ కరోనా థర్డ్ వేవ్ ఉధృతి తారా స్థాయికి చేరుకుంటుంది అన్న అంచనాలు వస్తూ ఉండటంతో ముందుగానే ‘ఆచార్య’ ను సెప్టెంబర్ లో తీసుకు వస్తే పరిస్థితులు చేయిదాటక ముందే సద్దుబాటు చేసుకోవచ్చు అన్న ఆలోచన చిరంజీవిది అని అంటున్నారు..