ప్రేక్షకులు తమ బాధలను మరిచిపోయి కొంతసేపు అయినా సంతోషంగా ఉండడానికి వినోద సాధనాలు ఎన్నో ఉన్నాయి. కానీ అలా థియేటర్ కి వెళ్లి సినిమా చూసి ఒక రెండున్నర గంటల పాటు వేరే ప్రపంచంలో విహరిస్తే మనిషి ఎంత బాధలో ఉన్నా ఒక ఉపశమనం, ఒక హాయి కలుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సినిమాలు నచ్చుతూ ఉండడం సహజమే. ఒక సినిమా అంటే ఆరు పాటలు, నాలుగు ఫైట్లు ఉండేలా మన దర్శక నిర్మాతలు సినిమాలను తెరకెక్కిస్తూ వచ్చారు. కానీ రాను రాను ఆ అలవాటు పూర్తిగా మారిపోయింది. కొన్ని సినిమాల్లో పాటలు ఏమీ ఉండవు. మరికొన్ని సినిమాల్లో ఫైట్లు అసలే ఉండవు. ఫైట్లు ఉండకపోయినా పరవాలేదు కానీ. పాటలు లేకుండా సినిమాని ఊహించుకోవడం కష్టం. ఆ పాటల్లో ఉండే సంగీతం మనిషిని ఆనందడోలికల్లో విహరించేలా చేయగలదు.
కొన్ని సినిమాలు పాటలే ప్రధాన ఇతి వృత్తంగా తెరకెక్కిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కో పాట ఒక్కో నేపథ్యంలో తెరకెక్కించబడుతుంది. కొన్ని పాటలు పూలతోటల్లో, కొన్ని అడవుల్లో ఇలా పాటకు తగ్గట్టుగా లొకేషన్ లను సెలెక్ట్ చేసుకుని తెరకెక్కిస్తుంటారు. పాటకు తగ్గ లొకేషన్ ఉంటేనే ప్రేక్షకుడు అందులో లీనం అవగలడు. ఎన్ని లొకేషన్ లలో పాటలొచ్చినా వాన నేపథ్యంలో వచ్చిన పాటల ప్రత్యేకతే వేరుగా ఉంటుంది. ఇలా వాన బ్యాక్ గ్రౌండ్ లో ఎన్నో పాటలొచ్చాయి. కానీ కొన్ని పాటలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల కళ్ళల్లో మెదలాడుతూ ఉంటాయి. అటువంటి పాటలలో ఒకటే "వానా వానా వానా ... నీలాకాశం లోన..." అనే పల్లవితో సాగే పాట. ఈ పాటలో ఒకవైపు శ్రీను చిన్ననాటి జ్ఞాపకాలను తన స్నేహితులకు గుర్తు చేస్తుంటే, అప్పటికే వారిద్దరూ తీవ్ర బాధలో ఉంటారు. ఈ విషయం శ్రీనుకి తెలియదు. అందుకే ఆ బాధను శ్రీనుకి చెప్పలేక, తాను పాడే పాటను ఎంజాయ్ చేయలేక నరకవేదన అనుభవిస్తారు ఆ ఇద్దరు స్నేహితులు. ఈ పాటలో వారిద్దరి నటన అద్భుతమని చెప్పాలి.
ఈ పాట "శ్రీను వాసంతి లక్ష్మి" అనే సినిమాలోనిది. ఈ సినిమా 2004 లో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. అన్నింటినీ మించి "వానా వానా" పాట ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ఈ సినిమాలో సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ పి పట్నాయక్ శ్రీను అనే గుడ్డివాడి పాత్రలో నటించి ప్రేక్షకుల ఆదరణను పొందారు. ఈ సినిమాకు మ్యూజిక్ అందించింది మరియు పాడింది కూడా ఆర్ పి పట్నాయక్ కావడం విశేషం. ఇందులో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, పద్మప్రియ మరియు నవనీత్ కౌర్ ఇతర పాత్రలలో నటించారు. ఈ సినిమాకు శ్రీనివాస్ ఎడార అనే వ్యక్తి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి మ్యూజికల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల మెప్పును పొందింది.