పాటల ఫిలాసఫీ: కరోనా గాయానికి ఈ పాట ఒక మందులాంటిది ?

VAMSI
"ఒకే ఒక జీవితం ఇది చెయ్యి జారీ పోనీకు... మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు"
 కష్టమనేది లేని రోజంటూ లేదు కదా కన్నీరు దాటుకుంటూ సాగిపోక తప్పదుగా
 హో ఓ ఓ అమ్మ కడుపు వదిలిన అడుగడుగు హో ఓ ఓ ఆనందం కోసమే ఈ పరుగు
 హో ఓ ఓ కష్టాల బాటలో కడవరకు హో ఓ ఓ చిరునవ్వు వదలకు...."

కొన్ని పాటలు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేం..ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు. అంతేకాదు జీవితంలో అలాంటి సందర్భం ఎదురైనపుడు వెంటనే గుర్తొచ్చేస్తుంది. అంతగా మన మనసు పాటకు కనెక్ట్ అయిపోతుంది. మంచి భావమున్న పదాలు...అంతకుమించి అద్భుతమైన సంగీతంతో అవి మనల్ని ఆకర్షిస్తాయి. అలాంటివాటిలో ఒకటే ఈ పాట. మంచు మనోజ్ నటించిన "మిస్టర్ .నూకయ్య" అనే చిత్రం లోనిది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. దీనికి సంగీతాన్ని సమకూర్చింది యువన్ శంకర్ రాజా కాగా, యువన్ మరియు హరిచరణ్ ఇద్దరూ ఈ పాటకు గాత్రాన్ని అందించారు. ఈ పాట ఎంతో సూపర్ హిట్ గా నిలిచింది.

జీవితం యొక్క అసలైన అర్ధాన్ని పరమార్దాన్ని తెలియచెప్పే ఈ పాట అందరి మనసులను గెలుచుకుంది. జీవితం అంటే  సుఖాలు ఉన్నప్పుడు సంతోషంతో పొంగిపోవడం..కష్టాలు ఎదురైనప్పుడు కృంగిపోవడం కాదు.. ఎలాంటి సందర్భం అయినా మీ పెదవిపై చిరునవ్వే కనిపించాలి. సంతోషమైనా, కష్టమైనా ఆ సమయాన్ని సంతోషంగా స్వీకరించగలగాలని ఈ పాటలో చెప్పబడింది. అలా చేయగలిగినప్పుడే మీ జీవితం మీకు ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ఎంతో సమస్యాత్మకమైన పధ్మవ్యూహంలా  మారుతుంది అని చక్కగా వివరించారు. జీవితంలో కష్టాలు, సుఖాలు ఏవీ శాశ్వతం కాదు. ఏ సందర్భంలోను పరిస్థితులకు బయపడి కుంగిపోకూడాదు ధైర్యంతో ముందుకు సాగినపుడే ఆనంద తీరం కనపడుతుంది.

అలాగే ప్రస్తుతం మనం కరోనా సంక్షోభంలో ఉన్నా..ఇది నిజంగా గడ్డు కాలమే కానీ శాశ్వతం కాదన్నది గుర్తుంచుకోవాలి. ఇది కూడా కొంతకాలం తరువాత గడిచిపోతుంది. అలాంటి దీని గురించి ఎంతో మంది మానసిక ఒత్తిడికి లోనై లేనిపోని సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ఇలా భయాందోళనలకు లోనవ్వాల్సిన సమయం కాదు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం.

అలాగే ఈ పాటలో మరో అర్ధం కూడా వుంది
 
"పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే..
బతుకు అనే మార్గములో తన తోడేవారు నడవరులే
చీకటిలో నిసి రాతిరిలో నీ నీడ కూడా నిను వెతుకునులే
నీ వారు అను వారెవరు లేరంటూ నమ్మితే మంచిదిలే
చితి వరకు నీతో నువ్వే ...చివరంటా నీతో నువ్వే
చుట్టూ ఉన్న లోకమంతా నీతో లేనే లేదనుకో
నీకన్నుల్లో నీరు తుడిచే చేయి కూడా నీదనుకో ..."

కరోనా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పాటని గుర్తు చేసుకుని, దీనిలో ఉన్న భావాన్ని అర్ధం చేసుకోండి. ఈ  మహమ్మారి  సోకిందంటే మన కుటుంబ సభ్యులు సైతం మనల్ని దూరం పెట్టేస్తున్నారు. కరోనాతో మరణిస్తే కనీసం అంతిమ యాత్రకు కూడా మన వాళ్ళు రావడం లేదు. ఒంటరిగా మొదలైన మన జీవితం ఈ కరోనా కారణంగా ఒంటరిగానే ముగుస్తోంది. కానీ ఇదంతా విధి. విధి కూడా కాలంతో పాటు మారుతుంది. మళ్ళీ మన వాళ్ళతో కలసి సంతోషంగా గడిపే క్షణాలు తిరిగి వస్తాయి. కాబట్టి అందరూ మనోధైర్యంతో ఈ పరిస్థితులను ఎదుర్కొందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: