నేడు అందాల తార.. సమంత.. బర్త్ డే..!

N.ANJI
చిత్ర పరిశ్రమలో సమంత క్రెజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి తర్వాత కూడా అదే రేంజ్ లో మూవీస్ లో దూసుకుపోతుంది ఈ భామ. అందం, చందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె నటనతో ప్రేక్షకులను మైమరిపిస్తూ టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా రాణిస్తున్నారు.
ఇక సమంత ప్రస్తుతం పౌరాణిక చిత్రం 'శాకుంతలం'లో శకుంతల పాత్ర పోషిస్తున్నారు. అక్కినేనివారి అబ్బాయి నాగచైతన్యకు విజయనాయికగా నిలచిన సమంత,ఆయన జీవితభాగస్వామిగానూ మారిపోయారు. పెళ్ళయిన తరువాత కూడా సమంత హీరోయిన్ గా తనదైన రీతిలో మెరుపులు మెరిపించారు.
కానీ, నాగచైతన్య సరసన సమంతను చూడడానికే తెలుగు ప్రేక్షకులు ఆశిస్తున్నారని తెలుస్తోంది. పెళ్ళయిన తరువాత వారిద్దరూ నటించిన 'మజిలీ' చూసి జనం జేజేలు పలికారు. వారి కాంబినేషన్ ను చూడాలనుకుంటున్న ప్రేక్షకులకు వైవిధ్యమైన పాత్రలతో ఇతర చిత్రాలలోనూ వినోదం పంచడానికి సమంత సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే 'మహానటి'లో సహాయ పాత్రలోనూ మెప్పించారు. ఇప్పుడు శకుంతలగా అలరించే ప్రయత్నమూ చేస్తున్నారు.

తమిళనాట పుట్టిన సమంత తెలుగునాట అడుగు పెట్టగానే 'ఏ మాయ చేశావే' సినిమాతోఅందరిని మాయ చేసేశారు. సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నాగచైతన్యకు ఆ సినిమాతో విజయాన్ని అందించి, విజయనాయిక అయ్యారు. తరువాత వరుసగా నటవారసులతో నటించిన సమంతకు "బృందావనం, దూకుడు" చిత్రాలు మంచి విజయాలనే అందించాయి. 'ఈగ'లో అభినయంతోనూ ఆకట్టుకున్న సమంతకు తరువాత వచ్చిన 'ఎటో వెళ్ళిపోయింది మనసు' ఉత్తమ నటిగా నంది అవార్డునూ అందించింది. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్, అ ఆ, రంగస్థలం" చిత్రాలతో తెలుగువారిని మరింతగా ఆకట్టుకున్నారు సమంత.
ఇక పెళ్ళయ్యాక సమంత నటనకు గుడ్ బై చెబుతారని భావించారు కొందరు. అయితే అందరినీ ఆశ్చర్య పరుస్తూ సమంత ఇతర హీరోల సరసన కూడా నటిస్తూ విజయకేతనం ఎగురవేశారు. కొన్ని పాత్రలు సమంత కోసమే రూపొందినట్టుగా ఆమె దరి చేరుతున్నాయి. ఆ కోవకు చెందినదే గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న పౌరాణికం 'శాకుంతలం'. ఈ సినిమాతో సమంత ఏ తీరున ఆకట్టుకుంటారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: