అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్న పవన్ యాటిట్యూడ్ !
గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పవన్ ‘జనసేన’ ఘోరంగా ఓడిపోవడమే కాకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కూడ ఓటమిపాలు చెందడంతో తిరిగి పవన్ సినిమాల వైపు యూటర్న్ తీసుకుని ప్రస్తుతం వరసపెట్టి సినిమాలను ఒప్పుకుంటున్నాడు. పవన్ ఓటమి భారాన్ని అతడి అభిమానులు ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు.
ఇలాంటి పరిస్థితులలో పవన్ ఒకేసారి ఎవరు ఊహించని షాకింగ్ నిర్ణయం తీసుకుని వచ్చేనెల 1వ తారీఖున జరగబోతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో ‘జనసేన’ పోటీ చేస్తోంది అన్న ప్రకటన చేసి పవన్ అభిమానులకు కూడ షాక్ ఇచ్చాడు. వాస్తవానికి పవన్ కు వీరాభిమానులు ఉన్నప్పటికీ జనసేన పార్టీకి భాగ్యనగరంలో సరైన పార్టీ నిర్మాణం ఇప్పటికీ జరగలేదు.
ఇలాంటి కీలక విషయాలను పట్టించుకోకుండా పవన్ జనసేన భాగ్యనగర ఎన్నికల రణరంగంలో ఎందుకు దిగుతున్నాడు అంటూ అతడి అభిమానులు కూడ ఆశ్చర్యపోతున్నారు. దీనికితోడు ఎన్నికల ప్రచారనికికానీ అభ్యర్ధులు ఎన్నికకు కానీ పట్టుమని 10 రోజుల సమయం కూడ లేని పరిస్థితులలో పవన్ ఇలాంటి సాహసం ఎందుకు చేస్తున్నాడు అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో మళ్ళీ ‘జనసేన’ కు పరాభవం ఎదురైతే పవన్ రాజకీయాల పట్ల సీరియస్ గా ఆలోచించడు అన్న విషయం మరొకసారి అందరికీ అర్ధం అయ్యేలా అవుతుందని అభిమానుల బాధ.
20వ తారీఖు నామినేషన్ల చివరి తేదీ. పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీటింగులలో బిజీగా ఉన్నాడు. వాస్తవానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా కీలక రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయా అంటే అదీ లేదు. ఇలాంటి పరిస్థితులలో పవన్ భాగ్యనగరాన్ని వదిలి ఇప్పుడు మంగళగిరికి ఎందుకు వెళ్ళాడు అన్న విషయమై సమాధానం లేని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇది ఇలా ఉండగా జీహెచ్ఎంసి ఎన్నికల నుండి తప్పుకోమని జనసేనకు బీజేపీ నుండి ఒత్తిడి వస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ హడావిడి మధ్య పవన్ ‘వకీల్ సాబ్’ షూటింగ్ కు బ్రేక్ పడటంతో ఈ నెలాఖరుకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలి అని ఆలోచనలు చేస్తున్న దిల్ రాజ్ జరుగుతున్న పరిణామాలను చూసి మరింత కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు టాక్..