ఎస్పీ బాలుకి భారత రత్న ఇవ్వాల్సిందే..!

NAGARJUNA NAKKA
గానగంధర్వుడు ఎస్పీ బాలుకి భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ మరింత ఊపందుకుంది.ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. మరోవైపు.. బాలుకి భారత రత్న ఇస్తే సంతోషిస్తామన్నారు కుటుంబ సభ్యులు.  

16 భాషల్లో 40వేల పాటలతో కోట్లాది మంది హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలంటూ ఆకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాలుకు భారత రత్న ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. భూపేన్ హజారికా, లతా మంగేష్కర్ తరహాలో బాలుకు భారత రత్న ఇచ్చి.. సముచితంగా గౌరవించుకోవాల్సిన అవసరముందన్నారు సీఎం జగన్.

బాలు అంత్యక్రియల రోజు హీరో అర్జున్ కూడా .. ఇదే డిమాండ్ చేశారు. బాలుకు భారత రత్న డిమాండ్ కు దక్షిణాది సినీరంగం కలిసి కట్టుగా ముందుకు రావాలని సూచించారు. ఎస్పీ బాలుకి భారత రత్న  ఇస్తే సంతోషిస్తామన్నారు కుమారుడు చరణ్. ఆ మహనీయుడు సంగీత సరస్వతికి చేసిన సేవకు గుర్తింపుగా భావిస్తామన్నారు. అ బాల గోపాలాన్ని తన గాత్రంతో రంజింపజేసిన బాలుకు భారత రత్న అవార్డు వస్తుందన్న ఆశలు.. ఆయన అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు చెన్నై ఎంజీఎం ఆస్పత్రితో ఎలాంటి వివాదం లేదన్నారు ఎస్పీ బాలు తనయుడు చరణ్. బాలు చికిత్స విషయంలో ఆస్పత్రి యాజమాన్యం చివరివరకూ తమకు అండగా నిలిచిందన్నారు. అనవసరంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జాతీయస్థాయిలో వివాదం చెలరేగడంతో.. ఎస్పీ చరణ్, ఎంజీఎం వైద్యులు వివరణ ఇచ్చారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి చెన్నై ఎంజీఎం వైద్యులు సరిగ్గా వైద్యం అందించలేదని...మొత్తం బిల్లు చెల్లిస్తే తప్ప, మృతదేహాన్ని అప్పగించమంటూ వేధించినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమన్నారు ఎస్పీ చరణ్. ఆస్పత్రిలో తన తండ్రి చికిత్సకు అయిన మొత్తం బిల్లును చెల్లించినట్లు తెలిపారు. తన తండ్రి లేని ఈ కష్టకాలంలో తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదన్నారు చరణ్... ఆస్పత్రిలో చేరిన రోజు నుంచి వైద్యులు, సిబ్బంది ఆయనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారన్నారు.. బాలు చనిపోయిన రోజు ఆస్పత్రి వైద్యులను బిల్లు గురించి అడగ్గా..తర్వాత చూసుకుందామని చెప్పారన్నారు. ఆస్పత్రి అకౌంటెంట్‌ కూడా ఇదే చెప్పారన్నారు. ఆస్పత్రి వైద్యబృందంతో కలిసి ప్రెస్ మీట్ లో వివరించారు చరణ్.

తామరైపాక్కంలో బాలుగుర్తుగా స్మారక చిహ్నం నిర్మించనున్నట్లు చరణ్ తెలిపారు. ఇంకా ప్లానింగ్ దశలోనే ఈప్రతిపాదన ఉందన్నారు. ఆయన అభిమానులు వచ్చి దర్శించుకునే విధంగా ఈ చిహ్నం ఉంటుందన్నారు చరణ్.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: