సంగీతం ఉన్నంతకాలం బాలు పాటలు సజీవం !

NAGARJUNA NAKKA
బాలసుబ్రహ్మణ్యం గానం కేవలం తెలుగుకే పరిమితం కాలేదు. తమిళం, కన్నడ, హిందీ సహా 14 భాషల్లో ఆయన పాటలు పాడారు. అక్కడ కూడా ఆయన అగ్రశ్రేణి గాయకుడిగా పేరు తెచ్చుకోవడమే కాదు.. అనేక అవార్డులు కూడా పొందారు. సినిమా రంగంలోనే కాకుండా అనేక భక్తిగీతాలతో ఆధ్యాత్మికరంగంలోనూ తనదైన ముద్రవేసుకున్నారు బాలు.

గంధర్వులు భువికి దిగివచ్చి పాడితే ఎలా ఉంటుందో బాలు పాడితే అలా ఉంటుందని చెబుతారు సంగీత పండితులు. అందుకే ఆయనకు గానగంధర్వుడనే పేరు వచ్చింది. ఆయన స్వరంలో సప్తస్వరాలు నాట్యమై నర్తించాయి. ఎంతో మంది గొప్ప గొప్ప నటులకు బాలు చేసిన గాత్రదానం తరాల మధ్య అంతరాలు తెలీకుండా చేసింది. సినీరంగంలోకి ప్రవేశించిన పదిహేనేళ్లకు బాలీవుడ్‌లో తొలిసారి బాలు గొంతు వినిపించింది. ఏక్‌ ధుజే కేలియే సినిమాలో బాలు పాడిన పాటలు దేశవ్యాప్తంగా ఉర్రూతలూగించాయి.

అంతకుముందు 1979లో శంకరాభరణం సినిమాకు నేషనల్ అవార్డ్ అందుకున్న బాలు.. ఆ తర్వాత హిందీలో తొలి సినిమాతోనే రెండో జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. అప్పటికే దక్షిణభారత దేశంలో పాపులర్‌ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న బాలు.. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ తనకు తిరుగులేదనిపించుకున్నారు.

తెలుగులో ఎంత పేరుందో తమిళంలోనూ బాలు అంతే పాపులర్ అయ్యారు. మద్రాసుతో బాలుకు విడదీయరాని అనుబంధం ఉంది. తనలోని కళను గుర్తించి అవకాశాలిచ్చింది మద్రాసే.! తెలుగు, తమిళ భాషలపై బాలుకు ఎంతో పట్టుంది. ఈ రెండు భాషల్లో పాటలను అలవోకగా పాడగల నేర్పు బాలు సొంతం. బాలు తమిళంలో పాడిన ఎన్నో పాటలు తెలుగులోనూ.. తెలుగులో పాడినవి తమిళంలోను డబ్ అయ్యాయి..

దేశవ్యాప్తంగా వందలాది మంది హీరోలకు బాలు పాటలు పాడారు. హీరోల గొంతులను అనుకరించి.. అందుకు అనుగుణంగా పాటలు పాడడం బాలు సొంతం. అందుకే తెరపై హీరోనే ఈ పాట పాడారేమో అనిపించేలా ఉంటాయి బాలు పాటలు.!

కేవలం సినిమాలకే బాలు గాత్రం పరిమితం కాలేదు. అనేక భక్తిగీతాలు ఆలపించారు బాలు. సొంతంగా అనేక ఆల్బమ్‌లను రూపొందించారాయన.! హిందూ దేవుళ్లపై ఆయన పాడిన పాటలు ప్రతి ఇంటా ప్రతిరోజూ వినిపిస్తూనే ఉంటాయి. సినిమా గీతాలను ఎంత శ్రద్ధగా ఆలపించారో.. మిగిలిన ఆల్బమ్‌లనూ అంతే భక్తితో పాడడం బాలుకే సొంతమైంది. పాటను ప్రాణంగా ప్రేమించడం బాలు నైజం. అందుకే ప్రతి పాటకూ జీవం పోయగలిగారు. సంగీతం ఉన్నంతకాలం బాలు పాటలు సజీవంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: