హీరో ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు, ఆ తర్వాత సాహోతో బాలీవుడ్ లో కలెక్షన్ల దుమ్మురేపారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్నవి, చేయబోయేవి అన్నీ పాన్ ఇండియా సినిమాలే. నేరుగా హిందీ డైరెక్టర్ ఓం రౌత్ తో ఆది పురుష్ సినిమా కూడా అనౌన్స్ చేశారు ప్రభాస్. హిందీ ఇండస్ట్రీలో అలా డైరెక్ట్ గా అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ కి పోటీగా వస్తున్నాడు హీరో విజయ్ దేవరకొండ. విజయ్ కూడా నేరుగా బాలీవుడ్ వెళ్లి అక్కడే బాహుబలికి పక్కలో బల్లెంలా మారాలను ప్లాన్ వేశాడు. ఓ హిందీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇప్పటి వరకూ విజయ్ దేవరకొండ చేసిన సినిమాలేవీ పాన్ ఇండియా మూవీస్ కాదు. అర్జున్ రెడ్డి అలాంటి క్రేజీ మూవీయే అయినా దాన్ని అన్ని భాషల్లోకి రీమేక్ చేసుకున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో చేస్తున్న ఫైటర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారాలనుకుంటున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. ప్రభాస్ లాగా నేరుగా ఓ హిందీ దర్శకుడితో సినిమా చేసి, హిందీ హీరో అనిపించుకోవాలని ఉబలాట పడుతున్నారు విజయ్.
విజయ్ దేవరకొండను హిందీ ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు చాలామంది దర్శకులు ఉత్సాహంగా ఉన్నారట. ఇటీవలే ప్రముఖ దర్శకుడు అభిషేక్ కపూర్ ఆయనకు ఓ కథ వినిపించారని..అది విజయ్ కు నచ్చడంతో చర్చలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. బాలాకోట్, పుల్వామా దాడుల నేపథ్యంతో ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ మూవీస్ కి క్రేజ్ ఎక్కువగా ఉంది. వార్ హీరోస్ ని హైలెట్ చేస్తూ.. సినిమాలు చేసి క్యాష్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇలాంటి సినిమాల్లో నటించినవారికి కూడా మంచి పేరొచ్చింది. తాజాగా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగినిగా కార్గిల్ గర్ల్ అనే సినిమా చేసింది. ఇప్పటికే చాలా సినిమాలు విడుదలైనా.. వార్ మూవీస్ కి బాలీవుడ్ లో ఇంకా క్రేజ్ ఉంది. అందుకే విజయ్ దేవరకొండ కూడా అదే జానర్ లో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు.