రజినీ కాంత్ కి లేని ధైర్యం హీరో సూర్యకి ఎక్కడిది..?
నీట్ పరీక్షల నిర్వహణపై మొదలైన వివాదంలో కేంద్రానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సూర్య. ఆ తర్వాత న్యాయస్థానాల తీర్పుపై కూడా వ్యాఖ్యానించి ఇబ్బంది పడ్డారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో నీట్ పరీక్షలు నిర్వహించడం తగదని దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం దీనిపై విచారణ జరిపి నీట్ పరీక్షల నిర్వహణకు మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డంతో హీరో సూర్య తీవ్రంగా స్పందించారు. ‘విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం అత్యంత విషాదం. ఇది నా మనసును ఎంతగానో కలచివేసింది. కరోనా నేపథ్యంలో ప్రాణభయంతో న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలిస్తున్నారు. విద్యార్థులను మాత్రం భయం లేకుండా పరీక్షలు రాయమని ఆదేశిస్తారు’అని ట్వీట్లు చేశారు.
సూర్య వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు జడ్జి సుబ్రమణ్యం చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. న్యాయమూర్తుల నైతికతపై సూర్య ట్వీట్లు చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే సూర్య విషయంలో హైకోర్టు సంయమనంతో వ్యవహరించి సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టింది. సూర్యపై ఎలాంటి కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోబోమని స్పష్టం చేసింది. దీంతో తమిళనాడులో ఉత్కంఠకు తెర పడింది. హీరో సూర్య కూడా ఈ నిర్ణయంపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
అయితే కేంద్రం నిర్ణయాలను వ్యతిరేకించడం, కోర్టు నిర్ణయాలపై కూడా తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పడంలో హీరో సూర్య రజినీకాంత్ కంటే ఓ అడుగు ముందు ఉన్నారని ఆయన అభిమానులంటున్నారు.