వివాదంలో సూర్య కొత్త సినిమా..!
ఆకాశమే నీ హద్దురా సినిమాను సెప్టెంబరు 30న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేయనున్నట్టు సూర్య ఇటీవల ప్రకటించారు. ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రాన్ని ఓటీటీ వేదికగా విడుదల చేసే ఆలోచనపై పునరాలోచన చేయాలని సింగం దర్శకుడు హరి కోరారు. సూర్య నటనకు అభిమానినైన తాను ఆయన చిత్రాలను పెద్ద తెరపై చూడాలనుకుంటున్నానని.. అలా చూస్తేనే బాగుంటుందన్నారు. ఈ సందర్భంగా సూర్యకు లేఖ రాశాడు హరి.
సూరారైపోట్రు ఓటీటీలో రిలీజ్ కావడంతో.. తమిళనాడులోని థియేటర్ల యాజమాన్యాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అయితే సూర్య తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ తమిళ దర్శకనిర్మాత భారతీరాజా మద్దతుగా నిలిచాడు. సూర్య గురించి కామెంట్ చేస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించాడు. ఈ నిరసనల వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందని... సూర్య కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు యత్నిస్తున్నారని ఆరోపించారు భారతీరాజా.
సూర్య తీసుకున్న నిర్ణయాన్ని వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ సమర్ధించాడు. థియేటర్స్ తెరుచుకున్నా.. జనాలను రప్పించి కరోనాకు బలి చేయడం సరైన పని కాదనీ ఆయన తన లేఖలో అభిప్రాయపడ్డాడు. జనవరి నెల వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశాలు లేవు. ఆ తర్వాత కూడా ఎలా ఉంటుందనేది అర్థం కాని పరిస్థితి ఉంది. అందరూ థియేటర్లోనే చూడండి అని ప్రజల ఆరోగ్యాలతో, వారి ప్రాణాలతో ఆటలాడటం చాలా తప్పన్నారు అశ్వనీదత్.
ఓటీటీలో నేరుగా రిలీజ్ అవుతున్న 'ఆకాశం నీ హద్దురా' చిత్రంతో పాటు.. వి సినిమా కూడా డిజటల్ ఫ్లాట్ ఫామ్‌లో రిలీజ్‌కు అంగీకరించిన నానీ అభినందించారు అశ్వనీదత్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రాలను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు.