కామెడీ కింగ్ వేణుమాధవ్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా..?
కామెడీ కింగ్ వేణు మాధవ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వేణుమాధవ్.. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ హీరోగా తెరకెక్కిన `సంప్రదాయం` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రి ఇచ్చి.. ఆ తర్వాత దాదాపు 400లకు పైగా సినిమాల్లో నటించాడు. హంగామా, భూకైలాస్, ప్రేమాభిషేకం చిత్రాల్లో హీరోగా కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే సినిమాల్లోకి రాకముందు ఈయన అసెంబ్లీలో లైబ్రరీ అసిస్టెంటుగా పనిచేసేవారు.
అక్కడ పనిచేసేటప్పుడు వేణుమాధవ్ ఖాళీ సమయాల్లో ఎదురుగా ఉన్న రవీంద్ర భారతికి వెళ్ళడం అలవాటైంది. అయితే వేణుమాధవ్ ఒకసారి ఆకృతి సంస్థ వాళ్ళు మాటల రచయిత దివాకర్ బాబుకు సన్మానం చేస్తుంటే చూడ్డానికి వెళ్ళి, అందులో వేదికపైన ఒక చిన్న ప్రదర్శన ఇచ్చాడు. రవీంద్రభారతిలో వేణుమాధవ్ చేసిన కామెడీ స్కిట్ అతడి జీవితాన్నే మార్చేసింది. వేణుమాధవ్ ఆ కార్యక్రమంలో చెప్పిన డైలాగ్స్ ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలు ఫిదా అయిపోయి `సంప్రదాయం` సినిమాలో అవకాశం ఇచ్చారు.
ఇక అప్పటివరకు మిమిక్రీ ప్రోగ్రాంకు రూ. 1000 మాత్రమే తీసుకునే వేణుమాధవ్‌కు ఆ సినిమా కోసం రూ. 70వేలు పారితోషికంగా ఇచ్చారు. నటుడిగా వేణుమాధవ్ తొలి రెమ్యునరేషన్ కూడా అదే. ఆ సినిమా పూర్తయిన మూడు రోజులకే శ్రీకారంలో అవకాశం వచ్చింది. అయితే పవన్ కల్యాణ్ నటించిన తొలి ప్రేమ చిత్రంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలతో బిజీ అయిపోయిన వేణుమాధవ్.. తనదైన నటనతో ప్రేక్షకులను రంజింపచేశాడు. ఇక టాలీవుడ్‌లో ఉన్న అగ్రనటులందరితోనూ నటించిన వేణుమాధవ్ ప్రస్తుతం మన మధ్య లేకపోయినా.. ఆయన జ్ఞాపకాలు మాత్రం ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చిరస్థాయిలో నిలిచిపోయాయి.