ఫ్లాప్ మూవీస్ కు ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిందా.. !

NAGARJUNA NAKKA

చిన్న సినిమాలు.. నిర్మాతలకు ఓటీటీ పెద్ద దిక్కుగా దొరికిందనుకున్నారు. కరోనా కష్టకాలంలో ఓటీటీ సంస్థలు ఆదుకుంటాయని సంబరపడ్డారు. ఓటీటీకి జై కొట్టారు. తీరా చూస్తే.. ఓటీటీలో ఇప్పటి వరకు రిలీజైన సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు. ఫ్లాప్ మూవీస్ కు ఓటీటీ ప్లాట్ ఫామ్ కేరాఫ్ అడ్రస్ గా మారడంతో.. కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. 

 

కరోనా ఎఫెక్ట్ ముందుగా సినిమా ఇండస్ట్రీపై పడింది. లాక్ డౌన్ కంటే ముందుగానే షూటింగ్స్ ఆపేశారు. మూసేసిన థియేటర్స్ ఇంతవరకు తెరవలేదు. ఎప్పుడు తెరుస్తారో చెప్పలేకపోతున్నారు. దసరా సీజన్ నాటికైనా ఓపెన్ అవుతాయా అనే డౌట్ లేకపోలేదు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న నిర్మాతలు ఓటీటీ వేదికలను ఆశ్రయించారు. ఒకవేళ థియేటర్స్ ఓపెన్ చేసినా.. పెద్ద సినిమాలు క్యూకడతాయి. థియేటర్స్ దొరకవు. ఈలోగా తెచ్చిన అప్పులకు వడ్డీ పెరిగిపోతుంది. ఈ కారణాలన్నీ ఓటీటీలకు జై కొట్టేటట్టు చేశాయి. 

 

బాషలతో సంబంధం లేకుండా.. తెలుగు.. హిందీ.. తమిళం.. మలయాళం..ఓటీటీలో రిలీజైన సినిమాలు నిరాశనే మిగిల్చాయి. అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన గులాబో సితాబో నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. దర్శకుడు సుజిత్ సర్కార్ స్లో నేరేషన్ నెటిజన్లకు నచ్చలేదు. 

 

మహానటి తర్వాత కీర్తి సురేష్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ పెంగ్విన్ తెలుగు, తమిళంలో ఒకేసారి ఈ నెల 19న అమేజాన్ లో రిలీజ్ అయింది. నటిగా కీర్తి మంచి మార్కులే అందుకున్నా.. ఎమోషన్ పండకపోవడం.. క్లైమాక్స్ ఆసక్తి లేకపోవడం పెంగ్విన్ కు మైనస్ అయింది. 

 

ఓటీటీ స్టామినా ఏమిటో తెలుసుకునే అవకాశం అమేజాన్.. నెట్ ఫ్లిక్స్.. లాంటి డిజిటల్ సంస్థలకు దక్కడం లేదు. బాగుందన్న టాక్ వస్తే.. ఓటీటీలో రెస్పాన్స్ ఎలా ఉంటుంది. ఆదాయం ఎలా ఉంటుందోనని ఓటీటీ సంస్థలు ఎదురుచూశాయి. వరుస ఫ్లాపులతో ఓటీటీ వేదికలు కూడా పునరాలోచనలో పడ్డాయి. ఏది పడితే అది కొంటే ఇబ్బంది పడాల్సి వస్తుందన్న ఆలోచన మొదలైంది. 

 

గతంలో సినిమాలు ఫ్లాప్ అయినా.. శాటిలైట్ రైట్స్ తో నిర్మాతలు లాభపడ్డారు. జనాలు చూడకపోయినా.. శాటిలైట్ హక్కుల కోసం సినిమాలు తీసిన దర్శక నిర్మాతలు ఉన్నారు. ఇలాంటి సినిమాలు ప్రసారం చేస్తే.. పెట్టుబడి కూడా రాని పరిస్థితిని ఛానెల్స్ ఎదుర్కొని శాటిలైట్ రైట్స్ బాగా తగ్గించేశాయి. ఇదే సీన్ ఓటీటీ విషయంలో రిపీట్ అయ్యే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: