అయ్యబాబోయ్..ఏంటీ అరాచకం.. పుట్టినరోజూ బాలయ్యకు మెగాబ్రదర్ కౌంటర్ ?

Chakravarthi Kalyan
ఈరోజు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు.. అందులోనూ గుర్తుంచుకునే 60 వ పుట్టిన రోజు.. అభిమానులు కొన్ని రోజుల నుంచే పండుగ మూడ్ లోకి వెళ్లిపోయారు. ఇక ఈ రోజంతా సోషల్ మీడియాలో బాలయ్యదే సందడి. బాలయ్య పుట్టిన రోజుకు.. సినీ ప్రముఖులతో పాటు చాలా మంది శుభాకాంక్షలు చెబుతున్నారు. సహజంగానే సినీ ఇండస్ట్రీలో చాలా ప్రముఖమైన కుటుంబం నుంచి రావడం, సుదీర్ఘమైన కెరీర్ ఉండటం.. 60వ పుట్టిన రోజుకావడం వల్ల అభినందనలు వెల్లువెత్తున్నాయి.

ఇలాంటి సమయంలోనూ నాగబాబు బాలయ్యపై కౌంటర్ వేయడం ఆసక్తికరంగా మారింది.

బాలయ్య – నాగబాబు మధ్య ఉన్న సోషల్ మీడియా వార్ ఈనాటిది కాదు.. గతంలో ఓసారి అసలు బాలయ్య ఎవరు అంటూ నాగబాబు కామెంట్ చేయడం వివాదానికి ఆజ్యం పోసింది. ఇటీవల సినిమా ఇండస్ట్రీ పెద్దల భేటీకి బాలయ్యను ఆహ్వానించకపోవడంపై బాలయ్య చేసిన వ్యాఖ్యలపైనా నాగబాబు మండిపడ్డారు. బాలయ్య ఓ స్టార్ మాత్రమేనంటూ విమర్శించారు.

అయితే బాలయ్యను పుట్టిన రోజు కూడా నాగబాబు కౌంటర్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తన పుట్టినరోజుకు ముందు సరిగ్గా ఒక్క రోజు ముందు బాలయ్య గతంలో ఘంటశాల పాడిన శివ శంకరీ శివానంద లహరీ అనే పాటను స్వయంగా పాడి సోషల్ మీడియాలో వదిలారు. ఈ పాటపై మిశ్రమ స్పందన వచ్చింది. ఘంటశాల పాడి మెప్పించిన పాటను అంతగా అలవాటు లేని బాలయ్య పాడటంతో ట్రోలర్స్ రెచ్చిపోయారు.

అయితే దీనిపై నాగబాబు కూడా స్పందించారు. డైరెక్టుగా కాకుండా ఇండైరెక్టుగా బాలయ్యకు కౌంటర్ వేశారు. ఒక్కోసారి ఓల్డ్ సాంగ్స్ రీమిక్స్ కన్నా ఒరిజినల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ తరానికి ఘంటశాల గాత్ర మాధుర్యం విలువ ఈపాటికి తెలిసి ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ఇది చూసి కనీసం పుట్టినరోజు కూడా బాలయ్యకు కౌంటర్ ఇవ్వాలా అంటూ బాలయ్య ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: