ఆస్కార్ విజేత రెహమాన్ కు కోపం వచ్చింది..!
ఆస్కార్ విజేత ఎ.ఆర్ రెహమాన్ కు కోపం వచ్చింది. అయితే ఆ కోపాన్ని మనసులో దాచుకున్నాడే గానీ.. దీనికి కారకులైన వారినిపై అసహనం ప్రదర్శించలేదు. అలాగని పల్లెత్తు మాట అనలేదు. తను పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకున్నాడు. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో తెలిపాడు. తనకొచ్చిన కోపాన్ని సింపుల్ గా కష్టంతో నయం చేసుకున్నాడు.
ఢిల్లీ 6 సినిమా కోసం రెహమాన్ కంపోజ్ చేసిన మసక్కలి సాంగ్ వినడానికి ఎంతో హాయిగా ఉంటుంది. రంగ్ దే బసంతి తర్వాత ఓ ప్రకాశ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా.. రెహమాన్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. అభిషేక్ బచ్చన్, సోనమ్ కపూర్ పై చిత్రీకరించిన మసక్కలి పాట ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇప్పుడీ పాటను రీమిక్స్ పేరుతో ఖూనీ చేశారు.
రెహమాన్ కంపోజిషన్ లో వచ్చిన సూపర్ హిట్ సాంగ్ మసక్కలిని మసక్కలి టు పాయింట్ ఓ పేరుతో రీమిక్స్ చేశారు. సిద్దార్థ్ మల్హోత్రా, తారా సుతారియా రొమాంటిక్ గా ఈ వీడియో ఆల్బమ్ చిత్రీకరించారు. తనీష్క్ బగ్చీ సంగీతం అందించారు. అయితే మసక్కలి 2.0 కంటే ఒరిజినల్ సాంగే బాగందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు.
తను కంపోజ్ చేసిన ఓ మంచి సాంగ్ ను ఖూనీ చేశారన్న బాధ రెహమాన్ లో ఉంది. అయితే దానిపై కామెంట్ చేయకుండా.. ఈ పాట కోసం పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నాడు రెహమాన్. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఈ పాట పూర్తి చేసేందుకు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామనీ.. అలాగే ఎన్నోసార్లు రీ రైట్స్ చేసి.. దాదాపు 200మంది మ్యూజిషియన్స్ కష్టపడి.. తరాలపాటు గుర్తుండిపోయేలా.. ఆ పాటను రూపొందించామన్నాడు రెహమాన్. దర్శకుడు, కంపోజర్, పాట రచయిత, నటీనటులు, నృత్య దర్శకులు అందరం కలిస్తే ఆ పాట. అని పేర్కొన్నాడు. ఒరిజినల్ మసక్కలి పాటను విని ఎంజాయ్ చేయండి అని పేర్కొంటూ.. సదరు పాటకు సంబంధించిన లింక్ ను కూడా షేర్ చేశాడు రెహమాన్.