త్రివిక్రమ్‌తో పవన్ రహస్య మంతనాలు.. అసలు కథ ఏంటో..?
త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అజ్ఞాతవాసి’ తర్వాత సినిమాలను పక్కన పెట్టి పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించాడు పవన్ కళ్యాణ్. అయితే ఎన్నికల్లో పవన్‌కు అనుకూలంగా ఫలితాలు లేకపోవడంతో పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఇక ఇప్పుడు మళ్లీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హిందీలో హిట్టైన ‘పింక్’ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘లాయర్ సాబ్’ టైటిల్‌తో పరిశీలనలో ఉంది. దీంతో పాటు అటు క్రిష్ దర్శకత్వంలో ఒక చారిత్రక నేపథ్యమున్న సినిమా మరియు హరీష్ శంకర్ సినిమాకు ఓకే చెప్పాడు.
ఇదిలా ఉంటే.. పవన్, త్రివిక్రమ్ అత్యంత సన్నిహితులన్న విషయం తెలిసిందే. ఇద్దరూ మంచి స్నేహితులు.. సినిమాను మించిన స్నేహం వీళ్లది. అయితే ఇటీవల కొన్ని రాజకీయ కారణాల వల్ల కాస్త దూరంగా ఉంటున్నారు. కాని, పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో.. పవన్ కళ్యాణ్, ఈ మధ్య వీలు చూసుకుని పలుసార్లు త్రివిక్రమ్‌తో భేటీ అయినట్లు తెలుస్తోంది. దాంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నాడనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. త్రివిక్రమ్, పవన్ కలిసి కట్టుగా సినిమాల నిర్మాణం దిశగా సమాలోచనలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
అన్నీ కుదిరితే, ఉగాది నాటికి ఈ విషయమై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలున్నాయట. ప్రస్తుతం పవన్ ఇటు నటన, అటు రాజకీయం.. రెండూ చూసుకోవడం కష్టమే. కానీ, పవన్ కళ్యాణ్ సినిమాలు నిర్మించాలనే ఆలోచనతో ఉన్నాడు. మరోవైపు టాప్ పొజిషన్‌లో ఉన్న త్రివిక్రమ్, నిర్మాణ బాధ్యతల్ని పూర్తిగా చూసుకోగలడా..? అన్నది కీలకమైన అంశం. ఈ నేపథ్యంలో పవన్, త్రివిక్రమ్.. స్లీపింగ్ ప్రొడ్యూసర్స్‌గా వుంటూ ఇంకొకర్ని యాక్టివ్ ప్రొడ్యూసర్‌గా రంగంలోకి దించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి అదే జరిగితే పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ నిర్మాణ సంస్థ... దాన్నుంచి కొన్ని సినిమాల అనౌన్స్‌మెంట్లూ మనం వింటామన్నమాట.