అనుకున్నట్టుగానే సైరా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మెగాస్టార్ మెగా మూమెంట్ తో మెగా ఫ్యాన్స్ భారీ హంగమాతో సైరా సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఇంతకుముందే చెప్పినట్టుగా సైరా సినిమాలో ఎన్నో సర్ ప్రైజులు దాచి ఉంచారు. కేవలం టీజర్, ట్రైలర్ లో చూపించనివి సినిమాలో చాలా ఉన్నాయి.
ముఖ్యంగా సైరా ఓపెనింగ్ పవర్ స్టార్ వాయిస్ ఓవర్ సినిమాకు మంచి హైప్ తీసుకొస్తుంది. ఇక ఆ వెంటనే స్వీటీ అనుష్క ఝాన్సి లక్ష్మీ బాయిగా వచ్చి షాక్ ఇస్తుంది. రుద్రమదేవిగా చేసిన అనుష్క ఝాన్సి లక్ష్మీ బాయిగా సర్ ప్రైజ్ చేస్తుంది. నరసింహా రెడ్డి కథను ఆమె చెప్పడం మొదలు పెడుతుంది.
ఇక సినిమా విషయానికొస్తే 60 ఏళ్లు దాటినా సినిమాలో చిరంజీవి నటన, దూకుడు ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. పొగరు నా ఒంట్లో ఉంది.. హీరోయిజం నా ఇంట్లో ఉంది అనే డైలాగ్ ఖైది నంబర్ 150లో చెప్పాడు. ఇంట్లోనే కాదు ఇంకా హీరోయిజం తన ఒంట్లో అలానే ఉందని ప్రూవ్ చేశాడు. నరసింహా రెడ్డి పాత్రకు చిరంజీవిని తప్ప ఇంక ఎవరిని ఊహించలేం అన్నట్టుగా చేశాడు.
డైలాగ్స్, యాక్షన్, మేకోవర్ ఇలా అన్ని విషయాల్లో చిరంజీవి తీసుకున్న శ్రద్ధ తెర మీద కనిపిస్తుంది. ఇక తండ్రి కలను నిజం చేసేందుకు నిర్మాతగా మారిన రాం చరణ్ సైరాతో మరోసారి సినిమాపై తనకున్న ప్యాషన్ ఏంటో చూపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకు బలమని చెప్పొచ్చు. సురేందర్ రెడ్డి డైరక్షన్ కూడా సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది. బాలీవుడ్ నుండి సైరా సినిమాకు మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. యూఎస్ లో ప్రీమియర్ షో టాక్ కూడా బాగుంది. మొత్తానికి సైరాతో చిరు అనుకున్న టార్గెట్ రీచ్ అయినట్టే అని చెప్పొచ్చు.