ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్‌నైట్ క్రేజీ హీరోగా మారిపోయాడు కార్తీకేయ. ఈ సినిమాలో కార్తీకేయ నటనతో పాటు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఎక్స్‌పోజింగ్‌తో సినిమా హిట్ అయ్యింది. యూత్‌లో మంచి పేరు తెచ్చుకున్న కార్తీకేయ తాజాగా హిప్పీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీప్పీలో బాడీ చూపించేందుకే నటించాడా ? అన్న విమర్శలు కూడా వచ్చాయి. కథలో కొత్తదనం లేకపోవడంతో ఆ సినిమాను ప్రేక్షకులు తిరస్కరించారు.
ఇక ఇప్పుడు స్వల్ప వ్యవధిలోనే కార్తీకేయ మరోసారి గుణ 369 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా టీజర్లు, ట్రయిలర్లతో మరీ కొత్తగా ఉన్నట్టు అనిపించకపోయినా టేకింగ్‌లో కొత్తదనం ఉండొచ్చన్న అంచనాలు ఇండస్ట్రీలో ఉన్నాయి. ఈ రోజు రాక్షసుడు సినిమాకు పోటీగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ప్రీమియర్ షో టాక్ ద్వారా తెలుసుకుందాం.
గుణ (కార్తికేయ) ఎలాగైనా బీటెక్ పాసై తన తండ్రి కోరిక తీర్చాలనుకునే సాధారణ కుర్రాడు. కాలనీలో మంచి కుర్రాడిగా పేరు తెచ్చుకున్న గుణ గీత (అనఘ)తో ప్రేమలో పడతాడు. వీరిద్దరు ప్రేమించుకుంటారు. ఆ టైంలో గుణ ఓ రౌడీ హత్య కేసులో జైలుకు వెళతాడు. గుణ కుటుంబం ప్రమాదంలో పడుతుంది. చివరకు ఈ సమస్యల నుంచి బయటపడేందుకు గుణ ఏం చేశాడన్నదే స్టోరీ.
సినిమాలో కార్తీకేయ బాగా ఆకట్టుకున్నాడు. లవర్ బాయ్‌గాను, ఎమోషనల్ సీన్లలోనూ మెప్పించాడు. తొలి చిత్రమే అయినా అనఘ నటన మెప్పిస్తుంది. లుక్స్ పరంగానూ అనఘ ఫుల్ మార్క్స్ సాధించింది. దర్శకుడు అర్జున్ జంధ్యాల కథను మాస్ యాంగిల్లో కమర్షియల్ ఫార్మాట్లో చెప్పాడు. బోయపాటి శిష్యుడు కావడంతో గురువును ఫాలో అయ్యాడు. ఫస్టాఫ్ ప్రేమ సీన్లలో కాస్త తడబడినా సెకండాఫ్‌లో మాత్రం ఎమోషనల్, యాక్షన్, సెంటిమెంట్ సీన్స్‌తో ఆసక్తికరంగా మలిచాడు. ఓవరాల్‌గా సినిమాకు మంచి టాక్ వచ్చింది. కమర్షియల్‌గా రాక్షసుడు సినిమాతో పోటీ పడి ఎలా హిట్ కొడుతుందో ? చూడాలి.