విద్య వికాసానికి మూలం. అలాంటి విద్య గురువు ద్వారా నేరుచ్చుకుంటేనే పరిపూర్ణత ఉంటుంది అని అంటారు. అందువల్లనే భారతీయ సంస్కృతిలో గురువుకు విష్టమైన స్థానం ఉంది. గురువు నుంచి జ్ఞానాన్ని పొందినప్పుడే విధ్యార్థి భవిష్యత్ బంగారుమాయం అవుతుందని మనుస్మృతి ప్రస్థావించింది.
శ్రీకృష్ణపరమాత్మకు సమకాలీనుడుగా జీవించిన వేదవ్యాసుడు పుట్టినరోజును ‘గురుపూర్ణిమ’ గా జరుపోకోవడం యుగాల నుండి కొనసాగుతోంది. అప్పటి వరకూ మౌఖికంగా ఒకరి నుంచి ఒకరికి సాగిన వేదజ్ఞానాన్ని అంతటినీ ఒక్కచోటకు చేర్చి నాలుగు విభాగాలుగా విభజించి వేద వాగ్మయాలను సామాన్యుడి చెంతకు చేరేలా చేయడంలో వ్యాసుడు ఎంతో కృషి చేశాడు.
మన పూర్వీకుల సాంప్రదాయంలో పరమశివుడుని ఆదియోగి గా మాత్రమే కాకుండా గురుసంప్రదాయంలో శివుడుని ఆదిగురువుగా ఆరాధిస్తారు. ద్వాపర యుగం వరకు వేదం ఎప్పుడు గ్రంధస్థం కాలేదు. అప్పటిదాకా గురువుల ద్వారా విని నేర్చుకునేవారు. అయితే కలియుగంలో మనిషి బుద్ధిని, జ్ఞాపకశక్తిని దృష్టిలో ఉంచుకుని, కలియుగ ప్రారంభానికి ముందు వ్యాసుడు అప్పటి వరకు ఒక్కటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి వ్యాసమహర్షిగా పేరుగాంచాడు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది అంటారు. అష్టాదశ పురాణాలు వ్రాసింది వ్యాసుడే అని చరిత్రకారులు చెపుతున్నారు. వ్యాసుడు భాగవాతాన్ని కూడ రచించాడు.
ఈరోజున దేశంలోని ప్రజలు అంతా వ్యాసుని రూపంలో ఉన్న తమ గురువుని కొలవడంతో ఈరోజు గురుపూర్ణిమ గా మారింది. హిందూ సంప్రదాయాలు పాటించే భారతదేశంతోపాటు నేపాల్, ఇంకా బుద్ధ, జైన సంప్రదాయాలు పాటించే అనేక చోట్ల గురు పౌర్ణిమను ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు గుడిలకు వెళ్ళి ప్రార్ధనలు చేయడమే కాకుండా చాల చోట్ల ఈరోజున ప్రజలు సత్యనారాయణ వ్రతాన్ని కూడ చేసుకుంటారు. ముఖ్యంగా చాలాచోట్ల షిరిడీ బాబా ఆలయాలు ఉన్న ప్రతిచోట ఈరోజు మొదలుకుని మూడురోజులు ప్రత్యేక పూజలు షిరిడీ బాబాకు జరుగుతాయి. సాయి బాబా భక్తులకు అత్యంత పరమ పవిత్రమైన రోజుగా ఈ ‘గురు పూర్ణమ’ ను భావిస్తూ సాయి బాబాలో తమకు ఇష్టమైన దైవంతో పాటు గురువును కూడ ఆరాధించడం ఈ గురుపూర్ణిమ ప్రాముఖ్యత..