నిన్న చెర్రీ - రేపు బన్నీ

K Prakesh
ఈ సంవత్సరం సంక్రాంతి పోటీకి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తో పోటీగా రామ్ చరణ్ పోటీ పడ్డాడు. రామ్ చరణ్ హీరోగా నటించిన ‘నాయక్’ ఈ సంవత్సరం జనవరి 9 వ తారీఖున విడుదల అయితే, కేవలం రెండే రెండు రోజుల వ్యవధి తేడాలో ప్రిన్స్ మహేష్ బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ జనవరి 11 న విడుదల అయింది. కాని అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి పండుగ రేసులో విజేతలుగా నిలవడమే కాకుండా 40 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ ను ఈ రెండు సినిమాలు అందుకున్నాయి. టాలీవుడ్ టాప్ హీరోలుగా పేరుగాంచిన వీరిద్దరు సినిమాలు ఒకే సారి విడుదల కావడం తో నిర్మాతలకు రావలసిన కలెక్షన్స్ స్థాయి కొన్ని కోట్ల వరకూ తగ్గడమే కాకుండా థియేటర్ల సమస్య కూడా తలయెత్తి ఈ రెండు సినిమాలు ఈ సంవత్సరం సంక్రాంతి హాట్ టాపిక్ గా మారాయి.

రాబోయే సంక్రాంతి రేసుకు టాలీవుడ్ లో అప్పుడే రంగం సిద్ధం అయి పొయింది. ఈ సంవత్సరం సంక్రాంతికి మహేష్ కు పోటీ ఇచ్చింది రామ్ చరణ్ అయితే, వచ్చే సంవత్సరం సంక్రాంతికి మహేష్ కి పోటీ ఇవ్వబోతోంది అదే మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన అల్లు అర్జున్. అల్లు అర్జున్ హీరోగా నిర్మాణం అవుతున్న ‘రేసు గుర్రం’ సినిమా మహేష్ క్రేజీ మూవీ గా ఇప్పటికే విపరీతమైన హైక్ తెచ్చుకున్న ‘వన్’ నేనొక్కడినే తో పోటీ పడబోతోంది. దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో దర్శకుడు సుకుమార్ గత సంవత్సర కాలం నుండి చెక్కుతున్న వన్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న రేసు గుర్రం తో పోటీ పడడానికి రంగం సిద్ధం అయింది. ఈ సినిమాల నిర్మాతలు కూడా వారి వారి సినిమాల విడుదల తేదీలను కనీసం దసరా పండుగ కూడా రాకుండానే ముందుగానే ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. మహేష్ వన్ మూవీ వచ్చే సంవత్సరం 10 తారీఖున విడుదల కాబోతోంటే బన్నీ రేసుగుర్రం ఒకే ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి వచ్చే సంవత్సరం 11 వ తారీఖున విడుదల కు రంగం సిద్ధం చేసుకుంటోంది.

ఈ విషయంలో మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2011 లో విడుదల అయిన మహేష్ బాబు ‘దూకుడు’ సినిమాతో దర్శకుడు సురేందర్ రెడ్డి తీసిన ‘ఊసరవెల్లి’ సినిమా పోటీ పడి ఘోరంగా పరాజయం అయింది. ఇప్పుడు మళ్ళి అదే సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న రేసుగుర్రం, మహేష్ ‘వన్’ సినిమాతో పోటిపడడం 2011 నాటి పోటీ ని మళ్ళి తెరపైకి తీసుకువస్తోంది. ఈ పరిస్థితులలో ఈ సంక్రాంతి కి వచ్చిన మహేష్ సంవత్సరం గ్యాప్ తీసుకొని మళ్ళి వచ్చే సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాడు. అయితే ఈ సంవత్సరం మహేష్ తో పోటీ పడింది చెర్రీ అయితే వచ్చే సంవత్సరం పోటీ పడబోతోంది బన్నీ. మరి ఈ రసవత్తర పోటీలో మహేష్ – బన్నీ లు ఇద్దరూ విజయం సాధిస్తారా..? లేకుంటే ఒకరే విజేతగా మిగులుతారా..? అనే విషయం తేలాలి అంటే వచ్చే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: