తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి, బాహుబలి 2 లాంటి గొప్ప చిత్రాలను తెరకెక్కించిన రాజమౌళి తన తదుపరి చిత్రం కోసం చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. తాజాగా రాజమౌళి స్టార్ హీరోలైన రాంచరణ్, ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్ మూవీ తీయబోతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ - ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తీయబోయే కోసం ఇద్దరు హీరో అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.
బాహుబలి కోసం ఓ మహాసామ్రాజ్యాన్నే సెట్ వేయించిన రాజమౌళి మల్టీస్టారర్ మూవీ కోసం కూడా ఓ భారీ సెట్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే 'బాహుబలి' చిత్రం కోసం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్లు ఆ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. ఆ తరువాత ఆ సెట్స్ చూడటానికి జనం ఎంతో ఉత్సాహాన్ని చూపించారు.
బాహుబలి సినిమా బిజినెస్ విషయంలో రాజమౌళికి - రామోజీరావుకు బెడిసికొట్టిందని.. దాంతో రామోజీరావు బాహుబలి సెట్లకు రూ. 90 కోట్లకు పైగా బిల్ పంపారనే న్యూస్ టాలీవుడ్ లో షికారు చేస్తోంది. దాంతో తన తదుపరి చిత్రం సెట్స్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో కాకుండా హైదరాబాద్ .. గచ్చిబౌలీలోని అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంగణంగా చెప్పుకునే విశాలమైన స్థలంలో వేస్తున్నారని సమాచారం.
ఈ చిత్రం నిర్మాతలు భారీ మొత్తం ముట్టజెప్పి ఫ్యాక్టరీ ఆవరణను రెండేళ్లపాటు లీజుకు తీసుకున్నారు. ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ సెట్ రూపకల్పన పని మొదలెట్టేశాడు. కాగా, ఈ చిత్రంలో కథానాయికలు ఎవరనే విషయంలో త్వరలోనే స్పష్టత రానుంది. మొత్తానికి రాజమౌళి తన రూట్ మార్చి కొత్త సెట్స్ ప్లాన్ చేయడం ఇప్పుడు ఫిల్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.