ప్రజాసేవ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు !

Seetha Sailaja
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న పవన్ ఒక్క క్షణం తీరిక లేకుండా అక్కడి తెలుగు వారిని కలవడమే కాకుండా అనేకమంది అమెరికాకు సంబంధించిన ప్రముఖులను కలుస్తూ తన అభిప్రాయాలను అక్కడి వారితో పంచుకుంటున్నాడు పవన్.  అమెరికాలోని న్యూహాంప్ షైర్ లో మీట్ అండ్ గ్రీట్ సదస్సుకు హాజరైన పవన్ ప్రజాసేవ పై ముఖ్యంగా రాజకీయాల పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ‘జనసేన’ పార్టీ అంతిమ లక్ష్యం అధికారం కాదనీ ‘ప్రజా శ్రేయస్సు’ అని అంటూ తన మనసులోని భావాలను మరొకసారి బయట పెట్టాడు. 

సినిమాల ద్వారా తాను సంపాదించిన డబ్బును, ఇమేజ్ ను ప్రజాసేవ కోసమే ఖర్చు చేస్తానని తెలిపాడు పవన్. తనకు దెబ్బ తినడం మాత్రమే కాదు, దెబ్బ కొట్టడం కూడా తనకు తెలుసు అంటూ తనను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న రాజాకీయ నాయకులకు చురకలు అంటించాడు పవన్. యువ రాజకీయ నేతలు అంటే రాజకీయ వారసులు కాదని సామాన్య ప్రజల్లో నుంచి కొత్త తరం నాయకులు రావాలని తాను అభిప్రాయ పడుతున్నట్లు పవన్ వివరించాడు. 

సినిమాలలో నటించేడప్పుడు  తానెప్పుడు సౌకర్యవంతంగా ఫీల్ కాలేనని ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నప్పుడే తనకు నిజమైన సంతృప్తి ఉంటుంది అంటూ తన అభిప్రాయాలను బయట పెట్టాడు పవన్.  రాజకీయాల పట్ల తనకు అనుభవం లేకపోయినా రాజకీయాల పట్ల తనకు పూర్తిగా అవగాహన ఉందని చెపుతూ తాను సమాజాన్ని పరిశీలించడమే కాకుండా ప్రజా సమస్యల పట్ల స్పందించే అలవాటు తనకు ఎప్పటి నుంచోనే ఉంది అంటూ తనను విమర్శిస్తున్న నాయకులకు సవాల్ విసిరాడు పవన్. 

రాజకీయాల్లో ప్రతి రూపాయి ఎలా ఖర్చు చేయాలో అవగాహన వచ్చిన తరువాత మాత్రమే తాను పార్టీ ఫండ్స్ ను స్వీకరిస్తాను కాని అప్పటి దాకా తాను ఎవరి దగ్గరా పార్టీ ఫండ్ తీసుకొను అని చెపుతూ పార్టీని నడిపేందుకే సినిమాలు చేస్తున్నానని మరో ట్విస్ట్ ఇచ్చాడు పవన్. అంతేకాదు తాను ఓపిక ఉన్నంత వరకు సినిమాలు చేస్తూనే ఉంటానని తన సొంత డబ్బులతోనే ‘జనసేన’ ను నడుపుతానని పవన్ ప్రకటించడం అమెరికాలోని పవన్ అభిమానులకు మరింత జోష్ ను ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

సుమారు గంటసేపు జరిగిన పవన్ ప్రసంగం అందర్నీ ఎంతో ఆకట్టుకుంది. ‘నేను పెద్దగా చదువుకోలేదు. డ్రాపవుట్ ను కూడా. కానీ జీవితాన్ని సమాజాన్ని చదవడంలో నేను నిత్య విద్యార్థినే. చిన్నప్పటి నుంచీ సమాజం తీరు తెన్నులనే గమనించేవాడిని. అనుకోకుండా నటుడినయ్యాను. మీ ఆదరణతో విజయవంతంగా నిలిచాను. నా వరకు నాకు బాగానే ఉంది. కానీ సమాజ పరిస్థితులు చూసి సౌకర్యంగా ఉండలేకపోతున్నాను’ అని ఉద్వేగభరితంగా చాల వరకు ఇంగ్లీష్ లో ఆతరువాత తెలుగులో చేసిన ఉపన్యాసం అందర్నీ ఆకట్టుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: