చంద్రశేఖర్ యేలేటి టార్గెట్ లో టాప్ హీరోలు !

Seetha Sailaja
తెలుగు సినిమా రంగంలో మంచి సినిమాలను తీయాలనే తపన ఉన్న దర్శకులు అతి తక్కువ మంది ఉంటూ ఉంటారు. ప్రస్తుతం మనకు ఉన్న విలక్షణమైన దర్శకుల్లో చంద్రశేఖర్ యేలేటి ఒకడు. ఇప్పుడందరూ తెలుగు సినిమాలలో కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్నామని మీడియా ఇంటర్వ్యూలలో చెపుతూ ఉంటే దాదాపు పుష్కర కాలం కిందట ‘ఐతే’ సినిమాను కొత్తదనానికి కేరాఫ్ అడ్రస్ గా తీసి తన ప్రతిభను చాటుకున్నాడు యేలేటి. 

అప్పటి నుంచి తాను తీసే ప్రతి సినిమాలోను ఎదో ఒక వైవిధ్యం ఉండేలా ప్రయత్నిస్తున్న ఈ దర్శకుడు గడిచిన 13 సంవత్సరాలలో కేవలం 5 సినిమాలు మాత్రమే తీసాడు అంటే ఎవ్వరూ నమ్మలేని విషయం. ఒక్క సినిమా తరువాత ప్రతి దర్శకుడు టాప్ హీరోలతో సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటే తనకు స్టార్ హీరోలను దృష్టిలో పెట్టుకుని కథలు వ్రాయడం చేతకాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు యేలేటి. 

కమర్షియల్ కథలు రాసే సామర్థ్యం లేకపోవడం వల్లే తాను టాప్ హీరోలతో సినిమాలు చేయలేకపోతున్నానని అంటూ టాప్ హీరోల పై కామెంట్స్ చేసాడు ఈ విలక్షణ దర్శకుడు. ‘‘హీరోల్ని దృష్టిలో ఉంచుకుని కథలు రాయడం తప్పేమీ కాదు. నన్ను కూడా కొందరు హీరోలు మంచి కథలు ఉంటే సినిమా చేద్దామని అప్రోచ్ అయ్యారు. కానీ నేను వాళ్లను దృష్టిలో ఉంచుకుని కథలు రాయలేకపోయాను. ఫార్ములా ప్రకారం కమర్షియల్ సినిమాలు చేయడం నాకు చేతకాని పని ‘ అంటూ కామెంట్స్ విసిరాడు యేలేటి.
 
ఇదే సందర్భంలో మాట్లాడుతూ వెంకటేష్ తో ఒక సినిమా చేయాలని గత ఏడాదిన్నర కాలంగా ప్రయత్నించానని అయితే ఆయనకు నచ్చే కథ తాను చెప్పలేకపోయాను అంటూ వెంకటేష్ ను టార్గెట్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. తాను ఒక్కో సినిమాకు ఎక్కువ సమయమే తీసుకుంటానని పైగా తాను రెండు కథల మీద పని చేసి మూడేళ్లు వృథా చేసుకున్నానని అంటూ తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు. ఈ విలక్షణ దర్శకుడి కొత్త సినిమా ‘మనమంతా’ కథ విని మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్ నటించడమే కాకుండా ఇలాంటి మంచి దర్శకుడు మలయాళంలో ఎందుకు లేరు అని కామెంట్ చేసాడు అంటే ఇతడి సత్తా ఏమిటో అర్ధం అవుతుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: