ఆ సినిమాలు రిజెక్ట్ చేయకపోతే సుమంత్ పరిస్థితి వేరేలా ఉండేది....!!

murali krishna
పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు స్టార్ హీరో అవుతాడని కలలు కన్నారు అక్కినేని అభిమానులు. కానీ స్వయంకృతంతోనే ఈయన స్టార్ కాదు కదా కనీసం హీరోగా కూడా సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అద్భుతమైన అవకాశాలు చేతి వరకు వచ్చినా కూడా చేజార్చుకున్నాడు సుమంత్. ఈయన వదిలేసిన సినిమాల గురించి తెలిస్తే వామ్మె అంటారు.
సుమంత్ కుమార్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు స్టార్ హీరో అవుతాడని కలలు కన్నారు అక్కినేని అభిమానులు. కానీ స్వయంకృతంతోనే ఈయన స్టార్ కాదు కదా కనీసం హీరోగా కూడా సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అద్భుతమైన అవకాశాలు చేతి వరకు వచ్చినా కూడా చేజార్చుకున్నాడు సుమంత్. ఈయన వదిలేసిన సినిమాల గురించి తెలిస్తే వామ్మె అనాల్సిందే. ఆ సినిమాలన్నీ కానీ చేసుంటే ఈ రోజు సుమంత్ ఫ్యాన్స్ అసోషియేషన్ కూడా వచ్చుండేదేమో..? ఎందుకంటే ఈయన మిస్ చేసుకున్న సినిమాలతో కొందరు హీరోల కెరీర్స్ సెట్ అయిపోయాయి. మరి సుమంత్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో చూద్దాం.
1.నువ్వే కావాలి: ప్రేమకథ సినిమాతో భారీగానే లాంఛ్ అయ్యాడు సుమంత్. తన మేనల్లుడిని తీసుకెళ్లి రామ్ గోపాల్ వర్మ చేతుల్లో పెట్టాడు నాగార్జున. 1999లో ఈయన నటించిన ప్రేమకథ విడుదలైంది. సినిమా ఫ్లాప్ అయినా కూడా అందులో పాటలు మాత్రం ఆల్ టైమ్ క్లాసిక్ అయిపోయాయి. అయితే ప్రేమకథ సినిమా చూసిన తర్వాత చాలా మంది దర్శకులకు సుమంత్ నటన బాగా నచ్చేసింది. మంచి సినిమాలు పడితే స్టార్ అవుతాడని అంతా అనుకున్నారు. అందుకే చాలా సినిమాలు ఈయన దగ్గరికి వచ్చాయి. అలా వచ్చిన వాటిలో సుమంత్ మిస్ చేసుకున్న తొలి ఇండస్ట్రీ హిట్ నువ్వే కావాలి. చాలా మందికి తెలీని విషయం ఏంటంటే.. ఈ కథను ముందు సుమంత్ కే నెరేట్ చేసారు. ఆ తర్వాత పవన్ దగ్గరికి వెళ్లింది. వాళ్లు మిస్ చేసుకున్నాకే తరుణ్ పాలిట నువ్వే కావాలి వరంగా మారింది.
2.తొలిప్రేమ: సుమంత్ చేజార్చుకున్న మరో బ్లాక్ బస్టర్ సినిమా తొలిప్రేమ. నమ్మడానికి ఇది కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. సుమంత్ హీరో కాకముందే కరుణాకరణ్ ఓ సారి ఈయన్ని చూసి తను రాసుకున్న కథను చెప్పాడు. అయితే అప్పటికి అనుభవం లేని దర్శకుడు కావడం.. అక్కినేని వర్గాలు కూడా కరుణాకరణ్ కథపై పెద్దగా నమ్మకం పెట్టుకోకపోవడంతో తొలిప్రేమ సినిమా సుమంత్ చేతి నుంచి జారిపోయింది. ఈయన కంటే ముందు ప్రేమదేశం అబ్బాస్ కూడా ఈ స్టోరీ రిజెక్ట్ చేసాడు.  ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అదే కథను చేస్తే ఎలాంటి సంచలనం రేపిందో గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అయితే అదే సినిమాలో నటించిన కీర్తి రెడ్డిని తర్వాత పెళ్లి చేసుకున్నాడు సుమంత్. కానీ పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకున్నాడు. మరోవైపు కరుణాకరణ్ తో వెంటనే యువకుడు సినిమా చేసాడు సుమంత్.
3.మనసంతా నువ్వే: సుమంత్ చేతి నుంచి జారిపోయిన మరో ఆణిముత్యం లాంటి సినిమా మనసంతా నువ్వే. ఎమ్మెస్ రాజు ఈ సినిమాలో ముందు మహేష్ బాబును హీరోగా అనుకున్నాడు. అయితే మరీ ఇంత సాఫ్ట్ కథ చేయడానికి ఆయన ఒప్పుకోలేదు. ఆ తర్వాత సుమంత్ వైపు అడుగులు వేసారు. అప్పటికి తొలి విజయం కోసం తహతహలాడుతున్న సుమంత్ కు ఎందుకో మరి మనసంతా నువ్వే కథ అంతగా నచ్చలేదు. దాంతో ఈ సినిమాను కాదన్నాడు. దాంతో అదే సినిమాను ఉదయ్ కిరణ్ తో చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు విఎన్ ఆదిత్య.
4.ఆనందం: ఒక్కోసారి బ్యాడ్ టైమ్ తలమీద డిస్కో డాన్స్ చేస్తుంటే ఎలాంటి కథలు విన్నా కూడా బాగోలేదనే అనిపిస్తాయి. సుమంత్ కు అలా ఒక్కసారి కాదు చాలా సార్లు బ్యాడ్ టైమ్ డాన్స్ చేసింది. అలా సుమంత్ చేజార్చుకున్న మరో బ్లాక్ బస్టర్ ఆనందం. అప్పటికే సుమంత్ నటించిన ప్రేమకథ, యువకుడు, రామ్మా చిలకమ్మా, పెళ్లి సంబంధం లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అలాంటి సమయంలో శీను వైట్ల చెప్పిన ఆనందం కథకు కూడా సుమంత్ కనెక్ట్ కాలేకపోయాడు. అదే కథను ఆకాశ్ హీరోగా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు వైట్ల.
5.పోకిరి: పూరీ జగన్నాథ్ తన ఇండస్ట్రీ హిట్ పోకిరి సినిమా కథ ముందుగా సుమంత్ కు చెప్పాడు. దీని పేరు ముందు ఉత్తమ్ సింగ్. పంజాబ్ నేపథ్యంలో కథ రాసుకున్నాడు పూరీ. అయితే ఈ కథకు ఎందుకో సుమంత్ అస్సలు కనెక్ట్ కాలేదు. దాంతో పూరీ జగన్నాథ్ కు నో చెప్పాడు. మహేష్ బాబు కూడా ఈ కథలో కొన్ని మార్పులు సూచించాడు. పంజాబ్ నేపథ్యం వద్దని.. దాన్ని హైదరాబాద్ కు మార్చాలని కోరాడు. మహేష్ చెప్పినట్లే చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు పూరీ జగన్నాథ్. పండుగాడి దెబ్బకు 2006లోనే టాలీవుడ్ రూ. 40 కోట్ల మార్క్ అందుకుంది. అంతకు ముందు రవితేజ... పవన్ కళ్యాణ్‌లు ఈ సినిమాను ఒద్దన్నవారిలో ఉన్నారు.
6.గమ్యం: క్రిష్ మొదటి సినిమా గమ్యం అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో గాలి శీను పాత్ర ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లరి నరేష్ కు ఆ పాత్రకు గానూ అవార్డులు కూడా వచ్చాయి. ఇదే కథను ముందు సుమంత్ కు చెప్పాడు క్రిష్. ఆ సమయంలో మధుమాసం, గోదావరి, గౌరి లాంటి సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు సుమంత్. అయితే క్రిష్ కథ సుమంత్ కు నచ్చలేదు. దాంతో నో చెప్పాడు. కానీ అదే కథతో సినిమా చేసి హిట్ కొట్టడమే కాదు అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు క్రిష్ జాగర్లమూడి.
7.నువ్వు వస్తావని: సుమంత్ కుమార్ చేజార్చుకున్న మరో అద్భుతమైన సినిమా నువ్వు వస్తావని. నాగార్జున మంచి ఫామ్ లో ఉన్నపుడు వచ్చిన సినిమా ఇది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను ముందు ఆర్ బీ చౌదరి సుమంత్ హీరోగానే రీమేక్ చేయాలనుకున్నాడు. కానీ అప్పుడున్న ఇమేజ్ కారణంగా ఈ సినిమా చేయలేకపోయాడు సుమంత్. అయితే అదే కథను తన మామ నాగార్జునతో చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఆర్ బీ చౌదరి. ఈ సినిమా మిస్ అయినా అదే బ్యానర్ లో స్నేహమంటే ఇదేరా సినిమా చేసాడు సుమంత్. కానీ అది ఫ్లాప్ అయింది.
దేశముదురు: పూరీ జగన్నాథ్ పోకిరి తర్వాత మరోసారి సుమంత్‌కే ఇంకో కథ చెప్పాడు. చిత్రమేంటంటే దాన్ని కూడా ఈయన రిజెక్ట్ చేసాడు. అదే దేశముదురు. ఈ కథ కూడా సుమంత్ కు అస్సలు నచ్చలేదు. దాంతో నిర్మొహమాటంగా నో చెప్పాడు. వెంటనే ఈ కథను అల్లు అర్జున్ కు చెప్పడం.. ఆయన ఓకే అనడం.. సినిమా చేయడం.. బ్లాక్ బస్టర్ కొట్టడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
9.నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్: ఈ సినిమా ఎంతమందికి నచ్చింది..? ఎంతమంది ఫేవరేట్ లిస్టులో ఉంటుంది..? దీనికి సమాధానం చాలా మంది మా లిస్టులో ఉంటుందనే చెప్తారు. ఈ కథలో రవితేజ కంటే ముందు సుమంత్ కే హీరోగా ఛాన్స్ వచ్చింది. అయితే అప్పుడప్పుడే సత్యం, గౌరి లాంటి సినిమాలతో ఇమేజ్ తెచ్చుకుంటున్న సుమంత్.. ఈ సాఫ్ట్ కథకు కనెక్ట్ కాలేదు. కథ నచ్చినా కూడా తనకు సెట్ అవ్వదని వదిలేసాడు.
10.ఇడియట్: ఒకానొక సమయంలో ఎందుకో తెలియదు కానీ పూరీ జగన్నాథ్ తను రాసుకున్న ప్రతీ కథను ముందు సుమంత్ దగ్గరికి తీసుకెళ్లడం.. ఆయన నో చెప్పిన తర్వాత ఇతర హీరోలకు చెప్పడం పరిపాటిగా మారిపోయింది. అలా ఇడియట్ సినిమాను కూడా కాదనుకున్నాడు సుమంత్. కన్నడలో హిట్ అయిన అప్పు సినిమాను ఇక్కడ రీమేక్ చేసాడు పూరీ. పవన్, సుమంత్ కాదన్న తర్వాతే రవితేజ ఇందులోకి వచ్చాడు. ఈ ఒక్క సినిమాతో మాస్ రాజా మార్కెట్ తో పాటు కెరీర్ కూడా టర్న్ అయిపోయింది.
11.ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం: ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం కథను కూడా ముందు సుమంత్ కే చెప్పాడు పూరీ. కానీ అది ఆయనకు నచ్చలేదు.
12.అష్టా చమ్మా | ఇక ఇంద్రగంటి మోహనకృష్ణ తన అష్టా చమ్మాకు ముందుగా సుమంత్ నే హీరోగా అనుకున్నాడు. కథ కూడా చెప్పిన తర్వాత నో చెప్పాడు సుమంత్. దాంతో నానిని హీరోగా పరిచయం చేసాడు. ఆ తర్వాత నాలుగేళ్లకు ఇదే కాంబినేషన్ లో గోల్కొండ హై స్కూల్ సినిమా వచ్చింది. సుమంత్ నో చెప్పడం వల్ల తెలుగు ఇండస్ట్రీకి నాని లాంటి ఓ నాచురల్ స్టార్ దొరికాడన్నమాట. ఒక్కసారి ఊహించుకోండి.. ఈ సినిమాలన్నీ పర్ సపోజ్ సుమంత్ కానీ చేసుంటే ఈ రోజు ఆయన రేంజ్ ఎలా ఉండేదో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: