రామబాణం రివ్యూ: సినిమా ఆకట్టుకుందా?

Purushottham Vinay
గోపీచంద్- శ్రీవాస్ కలయిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరి కలయికలో మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. 'లక్ష్యం', 'లౌక్యం' తర్వాత ఆ ఇద్దరూ కలవడం వల్ల మళ్ళీ ఈ కాంబినేషన్ పై అంచనాలు పెరిగాయి. విజయవంతమైన ఈ కాంబినేషన్ లో రూపొందిన మూడో సినిమా 'రామబాణం'. ఈ సినిమా ఆరంభం నుంచీ మంచి ప్రచారాన్నే సొంతం చేసుకుంది.మరి ఈ సినిమా ఎలా ఉంది?గోపీచంద్‌ స్టైల్ యాక్షన్‌ డ్రామా ఉందా?లేదా? వంటి విషయాలని మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.


ఈ సినిమా కథ విషయానికి వస్తే..రాజారామ్ (జగపతిబాబు) తన ఊళ్లో సుఖీభవ పేరుతో ఓ హోటల్ ని నడుపుతుంటాడు.ఇక ప్రజల ఆరోగ్యమే పరమావధి అనుకునే ఆయన... సంప్రదాయ వంటకాల్ని వండుతూ తక్కువ ధరలకే అందుబాటులో ఉంచుతుంటాడు. ఇక వ్యాపారంలో పోటీదారులకి అది కంటగింపుగా మారుతుంది. జీకే (తరుణ్ అరోరా), అతని మామ (నాజర్‌) సుఖీభవ హోటల్‌పై దౌర్జన్యానికి పాల్పడి దాని లైసెన్స్ ని తీసుకెళ్లిపోతారు. దాంతో రాజారామ్ తమ్ముడైన విక్కీ (గోపీచంద్‌) రాత్రికి రాత్రే వాళ్ల ఇంటిపై దాడిచేసి లైసెన్స్ ని తీసుకొస్తాడు. ఎంతో నీతి నిజాయతీగా మెలిగే రాజారామ్ ఏదైనా చట్ట పరిధిలోనే చేయాలని భావిస్తుంటాడు. ఇక తన తమ్ముడు విక్కీ చేసిన పని నచ్చని రాజారామ్... ఇలాంటివి చేస్తే జీవితంలో బాగా ఎదగలేమని చెబుతూ అతన్ని పోలీసులకి అప్పజెప్పేందుకు వెళతాడు. ఇంతలో విక్కీ తాను ఎప్పటికైనా కూడా బాగా ఎదిగి తిరిగొస్తానంటూ తప్పించుకుని కలకత్తా వెళ్లిపోతాడు. ఇక అక్కడికి వెళ్లిన విక్కీ ఏం చేశాడు? 15 ఏళ్ల తర్వాత తిరిగి రావల్సిన అవసరం ఆయనకి ఎందుకొచ్చింది? ఇక వచ్చాక ఏం జరిగిందనేది మిగిలిన అసలు కథ.


గోపీచంద్ కనిపించిన విధానం అయితే చాలా బాగుంది. సినిమాలో స్టైల్‌గా కనిపిస్తూ, యాక్షన్ ఘట్టాల్లోనూ, పాటలతోనూ బాగా మెప్పించాడు. కానీ ఆయన పాత్రలో ఏమాత్రం కూడా కొత్తదనం లేదు. జగపతిబాబుని ఈ మధ్య రౌడీగా మనం ఎక్కువగా చూస్తున్నాం. కానీ ఇందులో సాత్వికంగా కనిపిస్తూ రాజారామ్ పాత్రలో చాలా బాగా ఒదిగిపోయారు.ఆయన పాత్రని మలిచిన విధానం చాలా బాగుంది. హీరోయిన్ డింపుల్ హయాతి అయితే పాటలకే పరిమితం. వీళ్ళు డ్యాన్స్‌లు బాగా చేశారు. ఖుష్బూ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. అలీ, వెన్నెల కిశోర్‌, సత్య, గెటప్ శ్రీను ఇంకా సప్తగిరి గ్యాంగ్ చేసిన హంగామా పెద్దగా నవ్వించదు. తరుణ్ అరోరా, నాజర్ ఇంకా రాజా రవీంద్రతోపాటు కలకత్తా విలన్లు తదితరులు అలవాటైన పాత్రల్లోనే కనిపించారు. అలాగే కలకత్తా రౌడీలు, లోకల్ రౌడీలు ఇలా బోలెడంత విలన్ గ్యాంగ్ ఉన్నా ఆ పాత్రలన్నీ బాగా తేలిపోయాయి.అందువల్ల హీరోయిజం కూడా పెద్దగా పండలేదు.టెక్నీకల్ గా సంగీతం, కెమెరా, కళ విభాగాల పనితీరు బాగా మెప్పిస్తుంది. కొన్ని సీన్లు రిచ్‌గా కనిపించాయి. 'సాక్ష్యం' తర్వాత గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేసిన దర్శకుడు శ్రీవాస్ తన పనితీరుతో అంతగా ప్రభావం చూపించలేకపోయారు.ఒక్కసారి చూడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: