రికార్డుల రారాజు ఆమీర్ ఖాన్ బర్త్ డే స్పెషల్!

Purushottham Vinay
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లో వరుసగా ఇండస్ట్రీ హిట్లని నమోదు చేసిన ఏకైక హీరో అమీర్ ఖాన్. ప్రస్తుతం ఆమీర్ ప్లాపుల్లో వున్నా కానీ ఒకప్పుడు ఆమీర్ సినిమా అంటే చాలు ఖచ్చితంగా మినిమం గ్యారెంటి ఇండస్ట్రీ హిట్. గజినీ,3 ఇడియట్స్, ధూమ్ 3, పీకే, దంగల్ సినిమాలతో ఆమీర్ ఒక్క బాలీవుడ్ లోనే కాదు దేశవ్యాప్తంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశాడు.ఇండియాలో మొదటి 100 కోట్లు, 300 కోట్లు,500 కోట్లు, 700 కోట్లు,2000 కోట్ల వసూళ్లు చేసిన సినిమాలు ఆమీర్ ఖాన్ వి కావడం విశేషం. నేడు ఆయన పుట్టినరోజు. ఆమీర్ ఖాన్ 14 మార్చి 1965 న ముంబైలో పుట్టారు.నేటితో ఆమీర్ కి 57 ఏళ్ళు నిండాయి.భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన నటునిగా కూడా ఆమీర్ ప్రసిద్ధుడు.ఆయన అసలు పేరు మహమద్ ఆమిర్ హుస్సేన్ ఖాన్. ఆమీర్ నాలుగు జాతీయ పురస్కారాలతో పాటు ఏడు ఫిలింఫేర్ పురస్కారాలు కూడా అందుకున్నారు. భారత ప్రభుత్వం 2003లో పద్మశ్రీ, 2010లో పద్మ భూషణ్ పురస్కారాలతో ఆమీర్ ని గౌరవించింది.

తన పెద్దనాన్న నాసిర్ హుస్సేన్ తీసిన యాదోంకీ బారాత్ (1973) చిత్రంలో చిన్నపాత్రలో మొదటిసారి నటించారు ఆమిర్. ఆ తరువాత హోలీ సినిమాలో నటించిన ఆమీర్ హీరోగా ఖయామత్ సే ఖయామత తక్(1988) సినిమాతో తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలో ఇంకా ఆ తరువాత చేసిన రాఖ్ (1989) సినిమాలోనూ ఆయన నటనకు జాతీయ పురస్కారాలు వచ్చాయి. 1990వ దశకంలో ఆమీర్ నటించిన దిల్ (1990), రాజా హిందుస్థానీ (1996), సర్ఫరోష్ (1994) వంటి సినిమాలతో బాలీవుడ్ సినీరంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఆమీర్ సంపాదించుకున్నారు. సర్ఫరోష్ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు ఆమిర్ ఖాన్. కెనెడా-భారత్ కు చెందిన చిత్రం ఎర్త్(1998) సినిమాలో ఆమిర్ ఖాన్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి.

2001వ సంవత్సరంలో ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్ కంపెనీ అనే నిర్మాణ సంస్థను స్థాపించి మొదటి సినిమాగా లగాన్ ను నిర్మించి అందులో హీరోగా నటించారు ఆమిర్ ఖాన్. ఆ సినిమా ఉత్తమ విదేశీ భాషా సినిమాగా అకాడమీ పురస్కారం ఇంకా జాతీయ ఉత్తమ పాపులర్ చిత్రం పురస్కారం అందుకొంది. ఆ తరువాత ఏకంగా 4 ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న ఆమిర్ ఖాన్ 2006లో ఫనా, రంగ్ దే బసంతీ వంటి సినిమాలతో తిరిగి హిట్స్ అందుకున్నారు. ఆ తరువాతి సంవత్సరం తారే జమీన్ పర్ చిత్రంతో దర్శకుడిగా కూడా మారారు. ఈ సినిమాకి ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం పురస్కారాలు కూడా వచ్చాయి. ఇక అప్పటినుంచి దంగల్ దాకా ఆమీర్ ఖాన్ వరుసగా హిట్లు కొడుతూ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా నెంబర్ వన్ హీరో అయ్యాడు. కాగా థగ్స్ ఆఫ్ హిందూస్తాని, లాల్ సింగ్ చడ్డా సినిమాలతో వరుసగా ప్లాప్స్ అందుకొని డీలా పడ్డాడు. ఇప్పుడు స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: