8 పేజెస్ విషయంలో వ్యూహం మార్చిన నిఖిల్ !

Seetha Sailaja
‘కార్తికేయ 2’ విడుదల వరకు నిఖిల్ మార్కెట్ అంతంత మాత్రంగానే ఉంది. అయితే ‘కార్తికేయ 2’ కేవలం తెలుగురాష్ట్రాలలోనే కాకుండా హిందీలో కూడ ఘనవిజయం సాధించడంతో ఎవరూ ఊహించని విధంగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈమూవీ సక్సస్ తరువాత నిఖిల్ ను కలుస్తున్న దర్శక నిర్మాతలకు తన పారితోషికం పెంచిన విషయాన్ని చెప్పడమే కాకుండా తన మూవీని కూడ పెద్ద బడ్జెట్ లో తీయాలి అని కండిషన్స్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితులలో క్రిస్మస్ కు విడుదలకాబోతున్న తన ’18 పేజస్’ మూవీని హిందీలో విడుదల చేయవద్దని ముందుగా తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసి ఆతరువాత హిందీలో విడుదల చేద్దామని నిఖిల్ ఈమూవీ నిర్మాతలు గీతా ఆర్ట్స్ కు సూచిస్తున్నట్లు టాక్. ఇలా నిఖిల్ నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక ఆసక్తికర కారణం ఉందని అంటున్నారు.

ఈమూవీని దేశవ్యాప్తంగా ముఖ్యంగా బాలీవుడ్ లో ప్రమోట్ చేయాలి అంటే చాలసమయం అవసరమనీ 23వ తారీఖు చాల దగ్గరలో ఉంది కాబట్టి ఆమూవీని ఎక్కువ సమయం వీక్షించి బాలీవుడ్ లో ప్రమోట్ చేసేకంటే ఆసమయం తెలుగు రాష్ట్రాలలో ప్రమోట్ చేస్తే తన మూవీకి భారీ ఓపెనింగ్స్ వస్తాయని నిఖిల్ అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి నిఖిల్ చెపుతున్న ఈకారణం కాకుండా మరే కారణం అయినా ఉందా అన్నకోణంలో కూడ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

’18 పేజస్’ కథ ఒక క్యూట్ లవ్ స్టోరీ సుకుమార్ స్వయంగా ఈమూవీకి కథను స్క్రీన్ ప్లే ను అందించాడు. అయితే క్యూట్ లవ్ స్టోరీల కథలు బాలీవుడ్ కు కొత్త కాదు. దీనితో నిఖిల్ ఈమూవీని తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్ లో కూడ ఒకేసారి విడుదల చేయడం అంత మంచిది కాదు అని భావిస్తున్నాడా అన్నసందేహాలు కొందరికి వస్తున్నాయి. ‘కార్తికేయ 2’ బాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చడానికి మరొక కారణం ఉంది. ఆమూవీ కథ శ్రీకృష్ణుడు చుట్టూ తిరుగుతుంది. కృష్ణ తత్వం పై అభిమానం దక్షిణాది ప్రజలలో కంటే ఉత్తరాది ప్రజలలో ఎక్కువగా ఉంటుంది. ఈవిషయాలు అన్నీ దృష్టిలో పెట్టుకుని ’18 పేజస్’ విషయంలో సేఫ్ గేమ్ ఆడుతున్నాడా అనిపించడం సహజం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: